గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇక, ఆ వ్యాఖ్యలు చేసిన పవన్ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ నేత, జడ్జర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పై అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 70 ఏళ్లయినా పవన్ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఆస్తులు అమ్ముకొని విజయవాడ వెళ్ళిపోవాలని పవన్ కు హితవు పలికారు. టీడీపీని వదిలి ఒంటరిగా పవన్ పోటీ చేయగలరా అని ప్రశ్నించారు. ఓజీ సినిమా ఫ్లాప్ అయినా 800 రూపాయలు ఖర్చు పెట్టి తాను సినిమా చూశానని అన్నారు.
ఆంధ్రా డిప్యూటీ సీఎం పవన్ ఉండేది, వ్యాపారాలు చేసుకునేది తెలంగాణలో అని గుర్తు చేశారు. నిజంగా తెలంగాణ వాళ్ళ నర దిష్టి తగిలితే ఆంధ్రా వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా అని ప్రశ్నించారు.
ఇరిగేషన్, కన్‌స్ట్రక్షన్ రంగాల్లో ఆంధ్రా వాళ్ళు ఉన్నా తాము ఒక్క మాట కూడా అనలేదని చెప్పారు.
తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని, కానీ తప్పు మాట్లాడారు కాబట్టి ఇలా విమర్శించాల్సి వచ్చిందని అన్నారు. పవన్ తప్పుగా మాట్లాడారు కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిందేనని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates