వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. మన ప్రభుత్వమే వస్తుంది. మీరెవరూ అధైర్యపడొద్దు. నేనున్నాను అంటూ వైసీపీ అధినేత మరియు మాజీ సీఎం జగన్ మరోసారి వైసీపీ కార్యకర్తలకు భరోసా కల్పించారు. తాజాగా ఆయన తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. ఈ సందర్భంలో వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే వాస్తవానికి జగన్ ఈ మాట చెబుతున్నది ఇది తొలిసారి కాదు. గత ఆరేడు నెలలుగా ఇదే మాటను పదే పదే చెబుతున్నారు.
ఎక్కడికి వెళ్లినా ఎవరు వచ్చి ఆయనను కలుసుకున్నా వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని సమాధానమిస్తున్నారు. అయితే చెప్పడం తేలికే. ఊహల అల్లికలు వేసుకోవడం కూడా ఈజీయే. కానీ అధికారంలోకి రావడానికి అవసరమైన ప్రాథమిక మార్గాలు ఏమిటి అనే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు కనిపించడం లేదు. అంతేకాదు ప్రజల నాడి ఎలా ఉంది వైసీపీకి ఎంతవరకు అనుకూలంగా ఉన్నారు అనే అంశాలపై జగన్ దృష్టి పెట్టడం లేదని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
అధికారంలోకి వస్తామని అంటున్నారు. కానీ ఆధారం ఏమిటి? పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. వారికి కావాల్సిన కార్యాచరణను కూడా రూపొందించలేదు. జగన్‌ను చూసి జనాలు ఓటేస్తారనే నమ్మకం నేడు లేదు. అది గత ఎన్నికలతోనే పోయింది అని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు చెబుతున్నారు. ఇది వాస్తవమేనని పరిశీలకులూ అంగీకరిస్తున్నారు.
పైగా బలమైన కూటమి ప్రభావం, తగ్గని పవన్ కల్యాణ్ ఇమేజ్, పెరుగుతున్న మహిళా మరియు యువ ఓటు బ్యాంకుపై వైసీపీ ఇంకా సరైన దృష్టి పెట్టలేదు. వచ్చే ఎన్నికల నాటికి యువత ఓటు బ్యాంకు మరింత పెరుగుతుంది. దీనిని గమనించిన మంత్రి నారా లోకేష్ వారిని ఆకట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక మహిళా ఓటు బ్యాంకును దృఢపరచేందుకు సీఎం చంద్రబాబు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరో వైపు కూటమి కూడా బలంగానే ఉంది.
ఇన్ని పరిణామాలు ఉండగా వస్తాం వస్తాం అని చెప్పడం సరిపోదని సరైన ప్రణాళికనే కీలకమని పరిశీలకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates