మూడు రోజలు పాటు వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లా కడపలో పర్యటించారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులను సరైన మార్గంలో నడిపించాలన్న ఉద్దేశంతో ఆయన ఈ పర్యట పెట్టుకున్నారు. అయితే.. వర్షాలు.. వరదల కారణంగా దెబ్బతిన్న అరటి రైతులకు తమ పార్టీ తరఫున పరిహారం అందిస్తామని వాగ్దానం చేశారు. ఈ నేపథ్యం కూడా.. తాజాగా పర్యటనలో కీలకంగా మారింది. దీంతో అరటి రైతులను కూడా జగన్ పరామర్శించారు.
ఇదిలావుంటే.. రాజకీయంగా వైసీపీలో ఇబ్బందులు కొనసాగుతున్నాయన్నది వాస్తవం. ముఖ్యంగా సొంత జిల్లాలోనే పార్టీ పరిస్థితి, నాయకుల తీరు పార్టీకి ఇబ్బందిగా ఉంది. ప్రధానంగా 20 మందికి పైగా కీలక నాయకులు ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోవడాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్నారు. అలాగని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ఆయన సుముఖంగా లేరని తెలుస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పెద్దగా ముందుకు రావడం లేదు. జగన్ వస్తేనే వస్తాం.. అన్నట్టుగా ఉన్నారు.
వీరిని కార్యోన్ముఖులను చేసేలా నాయకులు సైతం ఎక్కడా ముందుకు రావడం లేదు. దీంతో ఇతర జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. కడపలో మాత్రం పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. దీనిని సరిచేయాలన్నది జగన్ ఆలోచన. కానీ.. ఆయన ముందుగా అనుకున్నట్టుగా అయితే.. కార్యక్రమాలు చేపట్టలేకపోయారు. కార్యకర్తలను కలుసుకుని వారి సమస్యలు విన్నారు కానీ.. నాయకులతో పెద్దచర్చలు చేపట్టలేదు. ఇదొక మైనస్ అయింది. ఇప్పుడున్న పరిస్థితిలో నాయకులను కదిపినా.. సమస్యలే చెబుతున్నారు.
ఇక, రైతుల సమస్యలు వినేందుకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. గతంలో వైసీపీ హయాంలోనూ ఇలానే సమస్యలు ఉన్నా.. అప్పట్లో క్షేత్రస్థాయిలో పర్యటించారా? అన్న ప్రత్యర్థుల విమర్శల ముందు ఈ పర్యటనలు తేలిపోయాయి. దీంతో కడప జిల్లా పర్యటన ముక్తసరిగానే సాగిందన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. బలమైన నిర్ణయాలు తీసుకోకుండా.. నాయకులను సరైన మార్గంలో పెట్టకుండా వ్యవహరించడం ద్వారా మరోసారి పార్టీలో ఉన్న సమస్యలకు పరిష్కారం లేకుండానే జగన్ పర్యటన ముగిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates