అమరావతిపై చాలా ఆశలు ఉన్నాయి, అలా చేయలేమని చంద్రబాబు అన్నారు. ఏపీ రాజధాని అమరావతిపై ప్రజలకు పెద్ద ఆశలు ఉన్నాయని తెలిపారు. దీనిని కేవలం 29 గ్రామాల పరిమితిలో మాత్రమే ఉంచలేమని చెప్పారు. అలాంటి ఆలోచనలు ఉంటే వాటిని విరమించుకోవాలని సూచించారు. అమరావతిని కేవలం మునిసిపాలిటీగా ప్రజలు కోరుకోవడం లేదన్నారు. దీనిని మహానగరంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు భూములు ఇచ్చిన 29 గ్రామాలతో పాటు మరిన్ని ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటామని చెప్పారు.
గురువారం సాయంత్రం అమరావతి కోసం భూములు ఇచ్చిన 80 మందికిపైగా రైతులతో చంద్రబాబు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ప్రగతి శీల నగరంగా, క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఇది కేవలం రాజధానిమాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించనున్నట్టు చెప్పారు. అందుకే మరో 45 వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించామని తెలిపారు. దీనికి రైతులు సంపూర్ణంగా సహకరించాలన్నారు.
అయితే కొందరు చెబుతున్న మాటలతో రైతులు తప్పు దారిలో నడుస్తున్నారని, అది సరైన దారి కాదని చెప్పారు. హైదరాబాద్ తరహాలో రాజధానిని అభివృద్ధి చేయాలంటే 29 గ్రామాల పరిమితి సరిపోదన్నారు. వాస్తవానికి హైదరాబాద్ కూడా సరిగా సరిపోవడం లేదని, అందుకే ఆ నగరాన్ని కూడా విస్తరించుతున్నారని చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విస్తరణ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. అమరావతి విషయంలో కూడా ఇదే చేస్తానన్నారు. ప్రజలకు అవసరమైనదే చేస్తున్నానని చెప్పారు.
రైతులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఎవరో చెప్పిన మాటలు వినొద్దన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని, రైతుల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని, ఆర్థిక సమస్యలనూ అత్యంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రైతులు చేసిన త్యాగాన్ని తరతరాల పాటు గుర్తు పెట్టుకుంటామని చంద్రబాబు అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates