కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్మథనంలో పడిందా? ఇప్పటి వరకు తాము ఏం చేసినా.. తిరుగులేదని, ఏ నిర్ణయం తీసుకున్నా.. వెనుకడుగు వేసేది లేదని.. భీష్మిస్తూ వచ్చిన ప్రధాని మోడీ.. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన బాట పట్టింది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ ఆందోళనలు ఇప్పుడు దేశం నలుమూలలకు విస్తరించాయి.
దీంతో ఏనాడూ.. దేశంలో ఏ ఆందోళనను పట్టించుకోని ప్రధాని నరేంద్ర మోడీ.. ఆయన సర్కారు.. కూడా రైతు ఉద్యమంపై ఉలిక్కి పడింది. ఇప్పటికే ఢిల్లీని చుట్టుముట్టిన రైతాంగం.. ప్రభుత్వం తాను తీసుకువ చ్చిన ప్రత్యేక వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని తీరాల్సిందేనని పట్టుబట్టడం, ప్రముఖులు తమకు దేశం తరఫున లభించిన పద్మ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తామని ప్రకటించడం, ఇప్పటికే కొందరు వెనక్కి ఇచ్చేయడం, వంటి పరిణామాలతో మోడీ ఆయా చట్టాలపై పునాలోచనలో పడ్డారని అంటున్నాయి ఢిల్లీ రాజకీయ వర్గాలు.
వాస్తవానికి ప్రధాని మోడీ తన పాలనలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో నోట్ల రద్దు వంటి సంచలన నిర్ణయం కూడా ఉంది. అదేవిధంగా జీఎస్టీ అమలు వంటి ఆర్థిక వ్యవస్థను కీలక మలుపుతిప్పిన పరిణామం కూడా ఉంది. ఆయా చట్టాలు తీసుకువచ్చినప్పుడు కూడా భారీ ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వచ్చాయి. పసుపు రైతులు ఉద్యమం, కావేరీ నీళ్ల కోసం కర్ణాటక, తమిళనాడు రైతులు ఉద్యమాలు చేయడం, చెరుకు మద్దతు ధర కోసం.. ఉత్తరాది రాష్ట్రాల రైతులు రోడ్డెక్కడం వంటివి మోడీకి కొత్తకాదు. అయితే.. ఏ నాడూ ఆయన వాటిపైనా.. తాను తీసుకున్న నిర్ణయాలపైనా సమీక్ష చేయలేదు.
తను తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అని.. దానికే కట్టుబడాలని మోడీ.. చెప్పకనే చెప్పారు. కానీ, ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలపై రోడ్డెక్కిన రైతాంగం విషయంలో మాత్రం ఒకింత పునరాలోచన చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా వ్యవసాయ మంత్రి తోమర్ రైతుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. మద్దతు ధరకు ఎలాంటి భంగం కలుగకుండా చూస్తామన్నారు. అయినప్పటికీ.. రైతులు సదరు చట్టాలను వెనక్కి తీసుకోవాలని పట్టుబడుతున్నారు. దీంతో ఏకంగా ప్రధాని మోడీ.. ఆయా చట్టాలపై పునః సమీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇదిలావుంటే.. ఇప్పుడు ఎదురైన అనుభవంతో మోడీ తీరు మారే అవకాశం ఉంటుందని అంటున్నారుపరిశీలకులు. ఎవరినీ సంప్రదించకుండా.. కేవలం కొందరి సూచనలను సలహాలతోనే ఆయన గతంలో అనేక చట్టాలు తెచ్చారని.. అయితే.. ఇప్పుడు మాత్రం.. రైతుల ఉద్యమం నేర్పుతున్న పాఠంతో భవిష్యత్తులో ఏదైనా కీలక చట్టం చేయాల్సి వచ్చినప్పుడు ప్రజాభిప్రాయానికి ప్రాధన్యం ఇవ్వడం ఖాయమని అంటున్నారు. మరి మోడీ తీరు మారుతుందో లేదో చూడాలి.