ఏపీకి మరో తుఫాను గండం? ఆ జిల్లాలపైనే..

మోంథా తుఫాన్ ను మరువక ముందే ఏపీ మరో తుఫాను గండం దూసుకు వస్తోంది. అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని రేపటికి తుపాన్‌గా బలపడనుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తుపాన్‌గా మారాక దీనికి ‘సెన్యార్’గా నామకరణం చేస్తారు. పశ్చిమ వాయువ్య దిశగా 2 వేల కిమీ దూరంలో వాయుగుండం కదులుతోంది. దీని ప్రభావంతో ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

‘సెన్యార్’ తుఫాను నేపథ్యంలో రైతాంగం అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాబోయే మూడు రోజుల్లో (నవంబర్ 26 నుండి) కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. పంట నష్టాన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వరి రైతులు కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని అధికారులు చెబుతున్నారు. మొక్కజొన్న , పత్తి, రైతులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

గత నెలలో వచ్చిన మొంథా తుపాను రాష్ట్రంలో అంచ‌నాల‌కు మించి అపార న‌ష్టం కలిగించింది. తుపాను వ‌ల్ల రూ.6384 కోట్ల న‌ష్టం వాటిల్లిందని, రూ.901.4 కోట్లు త‌క్ష‌ణ సాయం చేసి ఆదుకోవాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం విజ్ఞ‌ప్తి చేసింది. అప్పటికీ ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ విపత్తుల నివారణ కార్యాలయంలోనే ఉండి సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేశారు. రాబోయే తుఫానును కూడా సమర్థంగా ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.