ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పర్యటనలో ఏలూరు జిల్లా ఐ ఎస్ జగన్నాథపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని, ఆలయ ప్రదక్షిణ మండప నిర్మాణంతో పాటు గ్రామం నుంచి కొండ పైకి వెళ్లేందుకు రోడ్డు నిర్మింపచేస్తానని హామీ ఇచ్చారు.
ఆలయ అభివృద్ధి అంశాన్ని మంత్రివర్గం దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడుని, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కోరారు. దీనికి అనుగుణంగా ఆలయ అభివృద్ధికి రూ 8.7 కోట్ల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరు చేయించారు.
ఇక ఆలయానికి అనుబంధంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు 30 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇప్పించారు.
సోమవారం ఐ ఎస్ జగన్నాథపురం పర్యటనలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం రూ 3.5 కోట్ల దేవాదాయ శాఖ నిధులతో ఆలయ ప్రాంగణంలో నిర్మించనున్న ప్రదక్షణ మండపానికి, రూ 3.7 కోట్ల పంచాయతీరాజ్ రోడ్ అసెట్స్ నిధులతో గ్రామం నుంచి ఆలయానికి వెళ్లేందుకు నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు.
దీంతో పాటు ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ సహాయంతో పొంగుటూరు, లక్కవరం మధ్య గోతుల మయంగా ఉన్న రహదారికి రూ 1.5 కోట్లతో మరమ్మతులు చేయించారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ రహదారిని పరిశీలించారు.
అంతకు ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు ఐ ఎస్ జగన్నాథపురం వచ్చిన పవన్ కళ్యాణ్ కి ప్రజలు దారి పొడవునా పూల వర్షంతో స్వాగతం పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates