అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ‘డప్పు’ కొట్టుకున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య మే నెలలో జరిగిన ఉద్రిక్తతలను తానే స్వయంగా ఆపానని, లేకపోతే అది అణు యుద్ధానికి దారితీసేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికి దాదాపు 50 సార్లు ఇదే మాట చెప్పిన ట్రంప్, ఈసారి న్యూయార్క్‌లో జరిగిన సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్‌లో మరిన్ని కొత్త కథలు జోడించారు. “నేను జోక్యం చేసుకోకపోతే అణు బాంబుల దుమ్ము లాస్ ఏంజిల్స్ దాకా వచ్చేది” అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్ చెప్పిన వర్షన్ ప్రకారం.. మే నెలలో భారత్, పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు.. ఇద్దరు దేశాధినేతలకు వార్నింగ్ ఇచ్చారట. “మీరు యుద్ధం ఆపకపోతే రెండు దేశాలపై 350 శాతం సుంకాలు విధిస్తా. అమెరికాతో మీ వ్యాపారం బంద్ చేస్తా” అని బెదిరించారట. ఆ భయంతోనే ఇద్దరూ వెనక్కి తగ్గారని, తద్వారా తాను కోట్లాది మంది ప్రాణాలు కాపాడానని చెప్పుకొచ్చారు.
ఇక్కడితో ఆగకుండా, ప్రధాని మోదీ స్వయంగా తనకే ఫోన్ చేశారని ట్రంప్ ఎలివేషన్స్ ఇచ్చుకున్నాడు. “ట్రంప్, మేం యుద్ధానికి వెళ్లడం లేదు, ఆపేశాం” అని మోదీ చెప్పారని, అప్పుడు తాను “సరే, అయితే డీల్ మాట్లాడుకుందాం” అని అన్నానని ట్రంప్ ఓ కథ చెప్పారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా తనకు ఫోన్ చేసి థాంక్స్ చెప్పారని అన్నారు. తానొక్కడినే ఇలాంటివి చేయగలనని, వేరే ఏ అమెరికా అధ్యక్షుడు ఇలాంటి సాహసం చేయలేరని తనను తానే పొగిడేసుకున్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, మే 7న భారత్ “ఆపరేషన్ సింధూర్” పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. ఈ విషయం ప్రపంచానికి తెలిసిందే. ఆ తర్వాత మే 10న ఇరు దేశాల మిలిటరీ డైరెక్టర్ల మధ్య చర్చలు జరిగి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇది పూర్తిగా రెండు దేశాల మధ్య జరిగిన వ్యవహారం.
కానీ ట్రంప్ మాత్రం ఇందులో తానే హీరోనని కలరింగ్ ఇస్తున్నారు. అయితే భారత్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పటిలాగే ఖండించింది. తమ మధ్యవర్తిత్వం కోసం ఎవరినీ అడగలేదని, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండానే సమస్యను పరిష్కరించుకున్నామని ఢిల్లీ స్పష్టం చేసింది. అయినా సరే తన ఇమేజ్ కోసమో ట్రంప్ మాత్రం ఈ “అణు యుద్ధం” కథను వదలకుండా మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates