న‌వీన్ యాద‌వ్ ఘ‌న విజ‌యం.. కాంగ్రెస్ మార్పు ఇప్ప‌టి నుంచే!

జూబ్లీహిల్స్ ఒకే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం దక్కించుకుంది. ఆ పార్టీ ఊహించని విధంగా ఎన్నికల ఫలితం కూడా రావడం విశేషం అనే చెప్పాలి. మహా గెలిస్తే 4000 లేదా 5000 ఓట్లతో గెలుస్తామన్న వాదన ఆది నుంచి ఉన్నప్పటికీ ఇప్పుడు దాదాపు 25 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం దక్కించుకున్నారు. అయితే, ప్రభుత్వం విజయం దక్కించుకున్నప్పటికీ ఇది ఒక హెచ్చరిక గానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇది ఏకపక్ష విజయం అయితే కాదన్నది పరిశీలకుల మాట.

నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెబుతోంది. 6 గ్యారెంటీ లతో పాటు చెప్పని వాటిని కూడా అమలు చేస్తున్నామని ఆది నుంచి చెబుతున్నారు. ముఖ్యంగా 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని అదే విధంగా రైతులకు, నిరుద్యోగులకు మేలు చేస్తున్నామని పెట్టుబడులు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెబుతూ వచ్చారు. అలాంటప్పుడు భారీ విజయం నమోదు చేసుకోవడంతో పాటు ఏకపక్షంగానే ఇక్కడ ఎన్నికల జరుగుతాయని కొందరు భావించారు.

కానీ అలా జరగలేదు. పైగా ఆది నుంచి బీఆర్ఎస్ నుంచి బలమైన పోటీ అయితే వచ్చింది. విజయం అయితే దక్కించుకున్నారు. కానీ, ఆశించిన విధంగా అయితే ఏకపక్ష విజయం కాదన్నది స్పష్టమవుతుంది. ఇది ఒక రకంగా ప్రభుత్వానికే హెచ్చరికే. ప్రజలు ఎటువైపు ఏకపక్షంగా మొగ్గ చూపడం లేదన్నది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక చెబుతున్న వాస్తవం. అధికార పార్టీకి సహజంగా ఉప ఎన్నికల్లో అనుకూల ఫలితమే వస్తుంది. ఇప్పుడు కూడా అదే జరిగిందన్న వాదన కూడా వినిపిస్తోంది.

ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అధికారంలో ఉన్న పార్టీ విజయం దక్కించుకోవడం కామన్. ఎక్కడో ఒక్కొక్క సందర్భంలో మాత్రమే ప్రతిపక్షాలు విజయం దక్కించుకున్నాయి. గతంలో మునుగోడు ఉప‌ ఎన్నికల్లో ఇలాగే జరిగింది. దీంతో అధికార పక్షం ఇకనుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. సగానికి పైగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేరనే విషయాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ ప్రాధాన్యాలు ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ ఉపఎన్నిక అటు అధికార పక్షానికి ఇటు విపక్షానికి కూడా ఒక పాఠం అనే చెప్పాల్సి ఉంటుంది. ప్రజలు కోరుకుంటున్న విధంగా పాలన అందించడంలో అధికార పార్టీ అదేవిధంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో బీఆర్ఎస్ రెండూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆలోచన చేసుకోవాల్సిన అవసరం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తీసుకువచ్చిందనే చెప్పాలి. ఒక విజయంతో ఏది జరగదు. ఒక పరాజయంతో ఏది మునిగిపోదు. ఈ విషయాన్ని ఇరు పార్టీలు గ్రహించాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రెండు పార్టీలు ఈ తరహా ఆలోచనతో ముందుకు సాగితే తప్ప ప్రజల నాడిని పసి కట్టడం అనేది సాధ్యం కాదన్నది జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌ స్పష్టం చేస్తున్న ప్రధాన విషయం.