లోకేష్ సస్పెన్స్ ట్వీట్: రేపు ఉదయం భారీ ప్రకటన!

ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌తో సస్పెన్స్ క్రియేట్ చేశారు. “ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన!” అంటూ ఆసక్తి రేకెత్తించారు. విశాఖలో ఈనెల 14, 15 తేదీల్లో ఏపీ ప్రభుత్వం – సీఐఐ ఆధ్వర్యంలో భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నారు. దేశ, విదేశాల నుంచి వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లోకేష్ ఈ రోజు ఆసక్తికర ట్వీట్ చేశారు. “2019లో కొత్త ప్రాజెక్టులను నిలిపివేసిన ఆ కంపెనీ… రేపు ఆంధ్రప్రదేశ్‌లో దూసుకురానుంది! ఆ సంస్థ ఏమిటో తెలుసా..? రేపు ఉదయం 9 గంటలకు భారీ ప్రకటన! ఆసక్తిగా ఎదురుచూడండి!!” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక కంపెనీలు ఏపీని వదిలి వెళ్లిపోయాయని టీడీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గడంతో విశాఖలో ఐటీ రంగం కుదేలైందనే ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయ భవనాలు ఖాళీగా మారి, ఉన్న కంపెనీలు మూతపడినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని చెబుతున్నారు.

గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలన వల్ల రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందనేది టీడీపీ వాదన. అటువంటి పరిస్థితుల్లో, గతంలో వెళ్లిపోయిన ఒక పెద్ద కంపెనీ తిరిగి ఏపీకి వస్తోందని లోకేష్ తెలిపారు. “భారీ ప్రకటన వస్తోంది” అంటూ ఆయన సూచించారు.