ప్రతీ పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరబోతుంది

రాష్ట్రంలో సొంతిల్లులేని ప్ర‌తి పేద కుటుంబాన్నీ ఆదుకుంటామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. 2029 నాటికి.. రాష్ట్రంలో ఉన్న పేద‌ల‌ను గుర్తించి.. వారికి సొంత‌గా ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్య‌త‌ను స్వ‌యంగా తాను తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. తాజాగా అన్న‌మ‌య్య జిల్లా రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చిన మండెం అనే గ్రామంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో సీఎం పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 3 ల‌క్ష‌ల 192 ఇళ్ల‌ను పేద‌లకు ఆయ‌న అందించారు.

ఒకే స‌మ‌యంలో సామూహిక గృహ ప్ర‌వేశాల‌ను కూడా చేయించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ప్ర‌జా వేదిక స‌భ‌లో చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పేద‌లను అత్యున్న‌త స్థాయికి తీసుకురావాల‌న్న ల‌క్ష్యంతో త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌న్నారు. తాను.. ఎక్క‌డున్నా.. ఏం చేస్తున్నా త‌న ఆలోచ‌న‌ల‌న్నీ పేద‌ల కోసమేన‌ని వెల్ల‌డించారు. ముఖ్యంగా పేద కుటుంబాల్లోని వారిని ఆదుకునేందుకునిరంత‌రం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలో వారికి సొంతిల్లు నిర్మించాల‌న్న సంక‌ల్పాన్ని తీసుకున్న‌ట్టు చెప్పారు.

ప్ర‌స్తుతం 3 ల‌క్ష‌ల పైచిలుకు ఇళ్ల‌ను పేద‌ల‌కు ఇస్తున్నామ‌న్న చంద్ర‌బాబు.. వ‌చ్చే ఉగాది నాటికి మ‌రో 5 ల‌క్ష‌ల ఇళ్ల‌ను నిర్మించి.. వారికి అందిస్తామ‌న్నారు. అప్పుడు కూడా సామూహికంగా గృహ ప్ర‌వేశాలు చేయిస్తామ‌న్నారు. మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా ప్రోత్స‌హిస్తున్న‌ట్టు తెలిపారు. ఎంఎస్ ఎంఈల‌కు నాంది ప‌ల‌క‌డం ద్వారా.. మ‌హిళా పారిశ్రామిక వేత్త‌ల‌ను రూపొందించాల‌న్న నిర్ణయం సాకారం చేసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు వివ‌రించారు. అదేవిధంగా ప్ర‌తి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్త‌ను అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మ‌రోసారి ఆయ‌న వైసీపీ పాల‌న‌ను టార్గెట్ చేశారు. గ‌తంలో పేద‌ల‌ను మ‌భ్య‌పెట్టార‌న్న చంద్ర‌బాబు.. తాము కేవ‌లం 17 మాసాల్లోనే ఇళ్ల‌ను పేద‌ల‌కు అందిస్తున్నామ‌న్నారు. ఇది మంచి ప్ర‌భుత్వం అనే మాట ప్ర‌జ‌ల నోటి నుంచి వినిపిస్తోంద‌ని తెలిపారు. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని డెవ‌ల‌ప్ చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నామ‌ని.. అనేక అవాంత‌రాలు వ‌చ్చినా.. అధిగ‌మిస్తున్నామని వెల్ల‌డించారు.