ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నాలుగు ప్రధాన మంత్రిత్వ శాఖల బాధ్యతలు ఉన్నాయి. కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ – పర్యావరణ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు అప్పజెప్పారు. వాటికి ఆయన న్యాయం చెయ్యగలరా? ఆరు శాఖలు ఆయనకి భారంగా మారవా? అంటూ కొందరు సందేహాలు లేవనెత్తారు.
వాటిని పటాపంచలు చేస్తూ ఆ పదవులకే వన్నె తీసుకు వస్తున్నారని కూటమి పార్టీ నేతలు కితాబు ఇస్తున్నారు. సాస్కి నిధులతో పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అడవి తల్లి బాట పనుల పైన సీరియస్ గా దృష్టి పెట్టారు. జల్ జీవన్, పీఎం స్వామిత్వ అమలు స్వయంగా పరిశీలిస్తున్నారు. ఎకో పార్క్, ఎర్రచందనం, ఏనుగుల సమస్యపై రివ్యూ చేస్తున్నారు.
గత ప్రభుత్వాల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు అటవీ శాఖ మంత్రిత్వ బాధ్యతలను నిర్వహించారు. తెలుగుదేశం హయాంలో సిద్దా రాఘవరావు, గత వైసీపీ హయాంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ శాఖ మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు అదే శాఖను పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారు. అటవీ శాఖలో ప్రతి అంశాన్ని పరిశీలించి ఆయన చర్యలు చేపడుతున్న తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సహజంగా ప్రకృతిని ఇష్టపడే పవన్ కళ్యాణ్ వనాలు, వన్యప్రాణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అడవి తల్లి బాట పేరు మీద రోడ్లు వేయించడం, గూడేలకు వెలుగులు తీసుకురావడంలో ఆయన చూపిస్తున్న చొరవ అభినందనీయం.
ఇంకో వైపు గత 50 సంవత్సరాలుగా ఉన్న గ్రామీణ పంచాయతీ ఉద్యోగ వ్యవస్థను క్రమబద్ధీకరించి, ఒక రుఅర్భాన్ మరియు 3 అంచెలుగా పంచాయతీలను విభజించి, పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తున్నారు. పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి, స్వతంత్ర ప్రతిపత్తి వ్యవస్థలుగా ఎదగడానికి పవన్ ప్రణాళిక రూపొందించారు. మొత్తం మీద తనకు కేటాయించిన నాలుగు మంత్రిత్వ శాఖలకు పవన్ కళ్యాణ్ నగిషీలు చెక్కుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates