‘కూటమి కలిసి ఉంటే వైసీపీకి మంచిది’

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు వ‌చ్చే 15 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే కాద‌ని.. జీవితాంతం క‌లిసి ఉండాల‌ని తాము కోరుకుంటున్న‌ట్టు చెప్పారు. అంతేకాదు.. జీవితాంతం కూట‌మిగా ఉంటేనే వైసీపీకి మేలు జ‌రుగుతుంద‌న్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా ఉండాల‌ని.. గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మి క‌ట్టార‌న్న ఆయ‌న‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే కూట‌మి కొన‌సాగాల‌ని కోరుకుంటున్నామ‌న్నారు.

త‌ద్వారా.. వ్య‌తిరేక ఓటు బ్యాంకు త‌మ‌కు ప‌డుతుంద‌ని జోస్యం చెప్పారు. “వ‌చ్చే 15 ఏళ్లేంఖ‌ర్మ‌.. జీవితాంతం క‌లిసి ఉండాలి. అలా ఉండాల‌నే మేం కోరుకుంటాం. అలా ఉంటేనే మాకు కూడా మంచిది. చంద్రబాబు ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.. ఆయ‌న ద‌గ్గ‌ర ప‌వ‌న్ క‌ల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రేపు నారా లోకేష్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌.. ఆయ‌న ద‌గ్గ‌ర కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉప ముఖ్య‌మంత్రిగా ఉండాల‌నే కోరుకుంటున్నాం.“ అని వ్యాఖ్యానించారు.

ఇక‌, నారా లోకేష్‌ను `పిల్ల` నాయ‌కుడిగా అభివర్ణించిన అంబ‌టి.. ఆయ‌న బెదిరింపుల‌కు వైసీపీలో ఉన్న ఏ ఒక్క‌రూ బెదిరి పోర‌ని చెప్పారు. అనంత‌పురంలో ప‌ర్య‌టించిన నారా లోకేష్‌.. గ‌తంలో త‌మ‌ను వేధించిన వారిని వ‌దిలి పెట్టేది లేద‌ని.. జైళ్ల‌కు పంపిస్తామ‌ని వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించిన అంబ‌టి.. “ఏం చేస్తారో చేసుకోండి.. మ‌హా అయితే.. జైళ్ల‌కు పంపిస్తారు.. జైల్లో ప్రాణాలు తీస్తారా? ఏంటి?“ అని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. జైళ్లు త‌మ‌కు కొత్త‌కాద‌ని చెప్పారు. గ‌తంలో జ‌గ‌న్ జైల్లో ఉండే బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని, చంద్ర‌బాబు కూడా జైల్లో ఉండే బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని అంబ‌టి వ్యాఖ్యానించారు. “మీరు జైల్లో పెడితే.. మేం అక్క‌డే ఉండిపోతామా? బ‌య‌ట‌కు రాలేమా?“ అని వ్యాఖ్యానించారు. “ఇప్పుడు మీరు అధికారంలో రేపు మేం వ‌స్తే ఏం జ‌రుగుతుందో ఆలోచించుకోండి.“ అని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. పోలీసుల‌ను త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై అస్త్రాలుగా వాడుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు.