అటవీ పరివాహక ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాలలో మనుషులు, జంతువుల మధ్య సమన్వయం ఉండడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఏనుగులు గ్రామాలలోకి వచ్చి పంట నష్టం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. అలా ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకువచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం, అటవీ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ చొరవతో కర్ణాటక ప్రభుత్వం కుంకీ ఏనుగులను రాష్ట్రానికి ఇచ్చింది.
అంతటితో ఆగని పవన్ కల్యాణ్…టెక్నాలజీని ఉపయోగించుకొని ఏనుగులను తరిమివేసేలా చర్యలు చేపట్టారు. ఏఐ టెక్నాలజీ సాయంతో గన్ షాట్ శబ్దాల ద్వారా ఏనుగులను తరిమివేస్తున్నారు. సోలార్ ప్యానెళ్ల ఆధారిత ఏఐ టెక్నాలజీ సాయంతో ఏనుగుల రాకను గుర్తించే ఈ వినూత్న పద్ధతిలో వస్తున్న తుపాకీ పేలుడు శబ్ధాలు విని ఏనుగు ఒకటి పారిపోతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. పవన్ వినూత్న ఆలోచన సత్ఫలితాలను ఇస్తుండడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. గ్రామాలలోకి ఏనుగులు అడుగుపెట్టకుండా ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతోందని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ ఏఐ ఆధారిత తుపాకీ శబ్దాలు సత్ఫలితాలనిస్తుండంతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలలో కూడా దీనిని అమలు చేసేందుకు అటవీశాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వినూత్న పద్ధతిని పొరుగు రాష్ట్రాల వారు కూడా అనుసరించే యోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది. బహుశా ఈ తరహా టెక్నాలజీని వాడి ఏనుగులను తరిమివేసిన తొలి రాష్ట్రం ఏపీనే అని పవన్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates