వైసీపీకి మంత్రి లోకేష్ బిగ్ ఆఫర్!

నిజమే! టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. నిరంతరం రాజకీయ యుద్ధం చేసే ప్రతిపక్షం వైసీపీకి ఆయన బిగ్ ఆఫర్ ఇచ్చారు.

తాజాగా సోమవారం మీడియాతో మాట్లాడిన లోకేష్ పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల్లో తొలిసారి ఆయన వైసీపీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలు ఇప్పుడు కాదని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేసుకుందామని హితవు పలికారు. ఇదే సమయంలో “మేమే కాదు, మీరు కూడా పెట్టుబడులు తీసుకురావచ్చు. అప్పుడు అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం” అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, రాష్ట్ర అభివృద్ధి అనేది అందరూ కలిసి చేయాల్సిన పనిగా నారా లోకేష్ చెప్పారు. “పెట్టుబడులకు వైసీపీ నాయకులు ఎవరైనా సిఫార్సులు చేసినా ఆమోదించే కార్యక్రమాన్ని చేపడతాం. లేక పెట్టుబడులు తీసుకువచ్చినా సంతోషమే. ఏపీని అభివృద్ధి చేసేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చు. అందరితోనూ కలిసి పనిచేసేందుకు, కలిసికట్టుగా ముందుకు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే చేసుకుందాం. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిపైనే దృష్టి పెడదాం” అని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఇక ఇతర విషయాలపై తనదైన శైలిలో వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. విశాఖకు వచ్చిన గూగుల్ డేటా కేంద్రంపై ఆ పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారని, ప్రజల్లో లేనిపోని భయాలను పెంచుతున్నారని నారా లోకేష్ విమర్శించారు.

డేటా కేంద్రం ఏర్పాటుతో రేడియేషన్ పెరిగి చెట్టు పెరగవని పేర్కొంటూ ప్రజలకు భయపెడుతున్నారని చెప్పారు. ఇది సరికాదన్నారు. అన్నీ ఆలోచించే సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకువచ్చారని తెలిపారు.

దేశానికి వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా కేంద్రమేనని వెల్లడించారు. దీనివల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన జరుగుతాయని, అంతేకాకుండా విశాఖ రూపురేఖలు కూడా ప్రపంచ స్థాయికి పెరుగుతాయని వివరించారు.

యువత కోసం పోటీ

గత ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి చూపిస్తామన్నామనీ, వాటిని సాకారం చేసేందుకు పోటీ పడి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

16 నెలల్లోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకువచ్చామని ఆయన తెలిపారు. త్వరలోనే విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుందనీ, దీనిలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని వివరించారు.

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” వల్ల ఏపీకి పెట్టుబడుల వెల్లువ సాధ్యమవుతోందని, దీనికి సీఎం చంద్రబాబు విజనే కారణమని లోకేష్ వివరించారు.