ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల వేటలో కసరత్తు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 16 మాసాల్లోనే కీలకమైన 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తీసుకువచ్చారు. ఆ తర్వాత.. 15 బిలియన్ డాలర్ల మేరకు పెట్టుబడి పెట్టే గూగుల్ డేటా కేంద్రాన్ని కూడా తీసుకువచ్చారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలలోని పలు సంస్థలు.. అక్కడి పరిస్థితులు బాగోక వెళ్లిపోయేందుకు రెడీ అయితే.. వాటిని కూడా రావాలంటూ ఆహ్వానాలు పలుకుతున్నారు. ఇలా.. చంద్రబాబు, నారా లోకేష్ ఇరువురూ.. పెట్టుబడుల వేటలో అలుపెరుగని కృషి చేస్తున్నారు.
ఇక, రెండో ఏడాది పాలనలో అంతకుమించి అన్నట్టుగా పెట్టుబడులు సాకారం చేసుకునేందుకు తండ్రి తనయులు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా నారా లోకేష్ ఆస్ట్రేలియాలోను.. సీఎం చంద్రబాబు లండన్‌లోనూ పర్యటించనున్నారు. లోకేష్ ఇప్పటికే ఆదివారం(ఈరోజు) ఆస్ట్రేలియాకు చేరిపోయారు. రాష్ట్రానికి సంబంధించిన ఆక్వా పరిశ్రమల ఎగుమతులు సహా.. పెట్టుబడులపై ఆయన సుదీర్ఘంగా ఇక్కడి పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. అమెరికా నుంచి సుంకాల ప్రభావం పడడంతో ఆక్వారంగం ఇబ్బందిలో పడింది. దీని నుంచి ఆ రంగాన్ని కాపాడేందుకు రాష్ట్రం నుంచి ఆస్ట్రేలియాకు ఎగుమతులు చేసుకునే అవకాశం ఉండడంతో ఆదిశగానే మంత్రి నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు.
అదేవిధంగా వచ్చే నెల 14, 15 తేదీలలో నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు ద్వారా ఆస్ట్రేలియా నుంచి పారిశ్రామికంగా పెట్టుబడులు సాధించేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మెల్నోబర్న్‌లో ఈ నెల 23, 24 తేదీల్లో పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతారు. అదేసమయంలో రోడ్ షో కూడా నిర్వహించనున్నారు. ఇలా.. ఏపీకి సంబంధించిన పెట్టుబడులపై నారా లోకేష్ కూడా క్లీయర్‌గా పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు ఏ విధంగా అయితే.. క్షణం తీరికలేకుండా రాష్ట్రం కోసం కృషి చేశారో.. ఇప్పుడు మంత్రి నారా లోకేష్ కూడా అదే తరహాలో కృషి చేస్తున్నారు.
ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. వచ్చే నెల 2 నుంచి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు. ఈయన లక్ష్యం కూడా పెట్టుబడులే. రాష్ట్రానికి మెరుగైన పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా చంద్రబాబు ఇప్పటికే సింగపూర్ సహా పలు దేశాల్లో పర్యటించారు. ఇప్పుడు లండన్‌లోనూ పర్యటించడం ద్వారా టెక్స్‌టైల్స్, ఆక్వా రంగాల్లో పెట్టుబడుల కోసం ప్రయత్నించనున్నారు. అదేసమయంలో వజ్రాలు, గనుల రంగంలోనూ పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. గనుల రంగంలో కేంద్ర ప్రభుత్వం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా ఆ దిశగా ముందే అడుగులు వేయడం ప్రారంభించారు. సో.. అటు నారా లోకేష్, ఇటు చంద్రబాబు ఇద్దరూ కూడా పెట్టుబడుల వేటలో తీరికలేకుండా ఉండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates