బీఆర్‌ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రజల మధ్యకు వస్తేందుకు రెడీ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో తాజా జాగృతి జనం బాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో జాగృతి కార్యకర్తల మధ్య ఈ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌లో కేవలం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి ఫోటోలు మాత్రమే ముద్రించారు.
దీనిపై గత 24 గంటల్లో మీడియాకు లీక్ అయిన విషయమే తెలిసిందే. ఇక, పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ది-తనది దారులు వేరయ్యాయని తెలిపారు. అందుకే తాను ఆ పార్టీ అధినేత చిత్రాన్ని వాడడం సరికాదని, ఆ అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన ఫొటోను పెట్టుకోలేదని తెలిపారు. ఇక నుంచి తాను ప్రజల మనిషినని, వారే తనకు హైకమాండ్ అని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తన జాగృతి జనం బాట కార్యక్రమం ముగియనుందని తెలిపారు. ఈ సందర్భంగా మేధావులు, ఉద్యమకారుల సలహాలను తీసుకుంటానని వివరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై తన పర్యటన దృష్టి సారించనుందని వెల్లడించారు. అనేక మంది ప్రజలు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. వారి ఆశయ సాధనలో తాను కూడా గళం విప్పుతానని తెలిపారు.
మొత్తానికి ఇది రాజకీయ పార్టీనా కాదా అనే విషయంలో మాత్రం కవిత క్లారిటీ ఇవ్వలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates