నాగ‌బాబు గారూ.. నాకు తెలుగొచ్చు, మీ భాష రాదు

ఎన్నిక‌లు జ‌రుగుతోంది తెలంగాణ‌లో. అది కూడా జీహెచ్ఎంసీ పీఠం కోసం. అందుకోసం టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్నాయి. మాట‌ల యుద్ధాలు సాగిస్తున్నాయి. కానీ ఈ ఎన్నిక‌లతో సంబంధం లేని ఇద్ద‌రు వ్య‌క్తుల మధ్య ర‌చ్చ ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది. ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కు.. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబుకు అనుకోని వివాదం త‌లెత్తి సోష‌ల్ మీడియాలో దాని గురించి పెద్ద చ‌ర్చ ‌న‌డుస్తోంది. ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా అనుకోకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తావ‌న వ‌స్తే.. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు రాజ‌కీయ విధానాలు మార్చుకోవ‌డం, భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరి త‌న విలువ త‌గ్గంచుకోవ‌డం గురించి ప్ర‌కాష్ రాజ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప‌నిలో ప‌నిగా ప‌వ‌న్ ఊస‌ర‌వెల్లి రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని కామెంట్ చేశాడు.

ఈ వ్యాఖ్య‌లు ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబుకు బాగా కోపం తెప్పించాయి. ప్ర‌కాష్ రాజ్‌ను తీవ్ర స్థాయిలో విమ‌ర్శిస్తూ ఆయ‌న ఒక పోస్టు పెట్టారు. అందులో ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లు అంద‌రికీ అభ్యంత‌ర‌కరంగానే అనిపించాయి. ప్రకాష్ రాజ్ నిర్మాత‌ల్ని కాల్చుకు తిన్నాడ‌ని, సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ప్ర‌కాష్ రాజ్‌ను తొక్కి పెట్టి నార‌తీశార‌ని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. ఐతే ఈ స్పంద‌న‌పై ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్ సైతం స్పందించాడు. ఆయ‌న హుందాగానే నాగ‌బాబుకు బ‌దులిచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ‘‘గౌరవనీయులైన నాగబాబుగారికి.. మీ తమ్ముడు మీద ఉన్న ప్రేమ నాకు అర్థం అయ్యింది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు’’ అంటూ దండాలు పెడుతున్న సింబ‌ల్స్ పెట్టి ముగించేశారు ప్ర‌కాష్ రాజ్. హుందాత‌నంతో కూడిన ఈ స్పంద‌నతో ప్ర‌కాష్ రాజ్.. నాగ‌బాబును ఆత్మ‌ర‌క్ష‌ణ‌లోకి నెట్టాడ‌నడంలో సందేహం లేదు.