రాష్ట్రంలో సంచలనంగా మారిన జనసేన మాజీ నాయకురాలు కోట వినుత సెల్ఫీ వీడియో-ఆమె ఒకప్పటి కారు డ్రైవర్ రాయుడి దారుణ హత్య.. తాజాగా వెలుగు చూసిన రాయుడి సెల్ఫీ వీడియో ఉదంతాలపై తీవ్ర చర్చ సాగుతోంది. తనను హత్య చేసే అవకాశం ఉందంటూ… కోట వినుత, ఆమె భర్త చంద్రబాబుపై రాయుడు తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తూ.. చేసిన సెల్ఫీ వీడియో విడుదలైన 24 గంటల్లోనే వినుత కూడా సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అసలు తనకు ఈ హత్యతో సంబంధం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ విషయాన్ని గ్రహించే కోర్టు తనను… తన భర్తను బెయిల్‌పై విడుదల చేసిందన్నారు. అదేసమయంలో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డిపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
ఎవరీ వినుత..?
కోట వినుత ఉన్నత విద్యను అభ్యసించి.. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావంతో ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. 2014లోనే పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకున్నా.. ఆ సమయంలో పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. ఈ క్రమంలోనే 2019లో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత..అదే నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ పట్టుబట్టి తీసుకుని సీనియర్ నేత దివంగత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి ఇచ్చింది. ఆయన గెలుపులో వినుత కూడా.. సాయం చేశారు.
ఇక, సుధీర్ రెడ్డి విజయందక్కించుకున్న తర్వాత.. ఆధిపత్య రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇదే సమయంలో మద్యం, ఇసుక వ్యవహారాల్లో అటు సుధీర్‌కు, ఇటు వినుతకు మధ్య వాటాల పంపకాల్లో తేడా వచ్చిందనే ప్రచారం జరిగింది. దీంతో రెబల్‌గా మారిన వినుత.. సుధీర్ రెడ్డికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేయించారనే ఆరోపణలు వచ్చాయి. అధికారులను బెదిరించడం.. బూతులు తిట్టడం.. మద్యం సిండికేట్, ఇసుక అక్రమాలు.. ఇలా వరుస పెట్టి సుధీర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీటిపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. దీని వెనుక వినుత ఉందని గ్రహించిన సుధీర్ రెడ్డి.. నెమ్మదిగా ఆమెను ట్రాప్ చేయడం ప్రారంభించారని జనసేన వర్గాలు చెబుతాయి.
ఈ క్రమంలోనే వినుతకు డ్రైవర్‌గా వ్యవహరించిన రాయుడిని ఎమ్మెల్యే వర్గం తన వైపునకు తిప్పుకొందన్న ప్రచారం ఉంది. ఇదే తాజాగా.. రాయుడు సెల్ఫీ వీడియోలోనూ బయట పడింది. వినుతకు సంబంధించిన ప్రైవేటు వీడియోలను.. తనకు చేరవేస్తే.. 30-60 లక్షల రూపాయల సుపారీ ఇస్తానని ఎమ్మెల్యే వర్గం చెప్పిందని రాయుడు ఆరోపించారు. ఇక, ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే.. అనూహ్యంగా ఈ ఏడాది జూలై 12న చెన్నై పోలీసులు.. వినుత, ఆమె భర్త చంద్రబాబును అరెస్టు చేసిన తీసుకువెళ్లడం కలకలం రేపింది. ఆ సమయంలోనే చెన్నై పోలీసులు సంచలన విషయాన్ని చెప్పుకొచ్చారు.
జూలై 7న చెన్నై సమీపంలోని ఓ నదిలో రాయుడు మృత దేహం దొరికిందని.. ఆరా తీస్తే.. దీని వెనుక వినుత, ఆమె భర్త ఉన్నారని తెలిసి అరెస్టు చేసినట్టు ఏపీ పోలీసులకు సమాచారం చేరవేశారు. ఈ పరిణామం చోటు చేసుకున్న క్రమంలోనే జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వినుతను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత.. జూలై 31న వినుత, ఆమె భర్తకు మధ్యంతర బెయిల్ లభించింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ నేపథ్యంలో తరచుగా వారు.. పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేసి వస్తున్నారు. ఈ ఫొటోలు కూడా ప్రధాన మీడియాలో వచ్చాయి.
తాజాగా సెల్ఫీ వీడియోలు..
ఈ పరిణామాలు.. ఆగస్టు, సెప్టెంబరులో పెద్దగా తెరమీదికి రాలేదు. కానీ, తాజాగా వినుత తనను పార్టీ నుంచిసస్పెండ్ చేసినా.. స్వచ్ఛందంగా ఆమె పార్టీ కండువా కప్పుకొని ప్రజల మధ్యకు వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రాయుడి సెల్పీ వీడియో వెలుగు చూసింది. దీనిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తనను ప్రలోభానికి గురి చేశారని, వినుత ప్రైవేటు వీడియోలను పంపితే.. 30 లక్షలు నుంచి 60 లక్షల వరకు ఇస్తానని ఆశ చూపారని.. ఈ విషయం తెలిసి.. వినుత, ఆమె భర్త తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని రాయుడు ఆరోపించాడు. ఇది సంచలనంగా మారింది.
దీనికి కౌంటర్‌గా వినుత కూడా సెల్ఫీ వీడియోవిడుదల చేశారు. జైలుకు వెళ్లామన్న బాధ కంటే హత్య చేశామని చెప్పడమే బాధగా ఉందని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో తమ తప్పు లేదు కాబట్టే వెంటనే బెయిల్ వచ్చిందని అన్నారు. “మనసునిండా పుట్టెడు బాధ ఉంది. చేయని తప్పుకు జైలుకు వెళ్లిన బాధ లేక పోయినా.. మేము చంపామని ప్రచారం చేయడం చాలా బాధ కలిగిస్తోంది. రాయుడి చావులో మా ప్రమేయం లేదని కోర్టు భావించింది. కాబట్టే 19 రోజుల్లో బెయిలు ఇచ్చింది. నెల రోజుల్లోనే కేసులలో ఉన్న వారందరికీ బయలు వచ్చింది. విదేశాల్లో రూ లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే తప్ప మనుషుల ప్రాణాలను తీసేందుకు కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. ఎక్కువ మాట్లాడలేను” అని ఆమె పేర్కొన్నారు. ఇదీ.. సంగతి!!.
Gulte Telugu Telugu Political and Movie News Updates