అవును! ఏపీలోని చాలా జిల్లాల్లో ఇదే మాట వినిపిస్తోంది. టీడీపీకి కంచుకోటలుగా దశాబ్దాల పాటు.. సైకిల్‌ను పరుగులు పెట్టించిన జిల్లాల్లో వైసీపీ పాగా వేసింది. అనూహ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాలను తనవైపు తిప్పుకొని విజయం సాధించింది. ఇది జరిగి ఏడాదిన్నరే అయింది. వాస్తవవానికి వైసీపీకి పట్టులేనిచోట ఆ పార్టీ నేతలు గెలిచారంటే.. రీజనేంటి? అప్పటికే ఉన్న టీడీపీనేతలపై ఎక్కడో ప్రజల్లో అసంతృప్తి ఉండబట్టే కదా! ఈ గ్యాప్‌ను వైసీపీ భర్తీ చేస్తుందనే ఆశతోనే కదా.. ప్రజలు ఫ్యాను పార్టీకి పట్టం కట్టారు.
ఈ విషయాన్ని తెలుసుకునేందుకు పెద్దపెద్ద విశ్లేషణలు అవసరం లేదు. సాధారణ వ్యక్తికి కూడా అర్ధమవుతుంది. మరి అలాంటి జిల్లాల్లో వైసీపీ నాయకులు ఎలా వ్యవహరించాలి ? ప్రజలను ఎలా తమకు అనుకూలంగా తిప్పుకోవాలి? 2019లో ఉన్నసెంటిమెంటు లేదా భావావేశం అలానే వచ్చే ఎన్నికల వరకు కూడా ఉండవు కదా? ప్రజలను అన్ని రూపాల్లోనూ తమవైపు మళ్లించుకుంటేనే కదా.. శాశ్వత ఓటు బ్యాంకు తమకు ఏర్పడుతుంది? మరి ఈ విషయం వైసీపీ నేతలు గుర్తిస్తున్నారా? వ్యూహాత్మకంగా ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారా? అంటే.. లేదనే అంటున్నారు పరిశీలకులు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో టీడీపీ కి ఎవర్ గ్రీన్ అనదగిన నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ పాగా వేసింది. కానీ, ఈ జిల్లాల్లో రోజుకో రగడతో నాయకులు కొట్టేసుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక వివాదం తెరమీదకి వస్తోంది. నాయకులు ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుకు ప్రణాళికాయుతం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో ప్రజలు విసిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. హెడ్ ట్యాంక్ నుంచి ఎంత నీరు వచ్చినా.. స్థానికంగా ఉన్న కుళాయిలు తుప్పు పడితే.. ప్రయోజనం ఏంటి? అనేది ఇక్కడి వారు నర్మగర్భంగా చేస్తున్న వ్యాఖ్య.
అంటే.. సీఎం జగన్ ఎన్ని పథకాలు పెట్టినా.. ఎంతగా డబ్బులు పంచినా.. అందరికీ చేరవు కదా? సగానికి పైగా జనాలు స్థానిక నేతలపై ఆశలు పెట్టుకుంటారు. వారి నుంచి తమ పనులు చేయించుకోవాలని భావిస్తారు. కానీ, వైసీపీ నాయకులు మాత్రం తమలో తాము ఘర్షించుకుంటూ కూర్చుంటే.. ఇక పార్టీ ఎదుగేది ఎప్పుడు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. బహుశ.. ఈ విషయాన్ని గమనించారో. ఏమో..చంద్రబాబు.. మౌనం పాటిస్తున్నారు. వారిలో వారే కొట్టుకుంటే.. తమ ప్రయత్నం లేకుండానే తమకు లబ్ధి చేకూరుతుందని.. తిరిగి ప్రజలు అప్రయత్నంగా తమవైపు తిరుగుతారని ఆయన భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇది నిజమేనని అనిపిస్తోంది. మరి ఇప్పటికైనా వైసీపీ నాయకులు కళ్లు తెరుస్తారా? లేదా? చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates