బాబు విజ‌న్‌: ఏపీకి మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు విజ‌న్‌-2047తో ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పెట్టుబడుల‌కు భారీ స్థాయిలో ఆయ‌న ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న అపార అవ‌కాశాలను వివ‌రించి.. పెట్టుబ‌డి సంస్థ‌ల‌ను ఆయ‌న ఆహ్వానిస్తున్నారు. తాజాగా ఈ క్ర‌మంలో ఓ అంత‌ర్జాతీయ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. రాష్ట్రంలోని సముద్రతీర రంగంలో వ్యాపార వృద్ధికి అవకాశం.. వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు ‘గజ్‌ప్రొమ్‌’ మొగ్గు చూపింది.

తీర ప్రాంతాల్లో ఓడరేవులు, గ్యాస్‌ ఆధారిత ప్లాంట్ల విషయంలో ఆసక్తి క‌న‌బ‌రుస్తున్న గ‌జ్ ప్రొమ్ సంస్థ‌ కాకినాడలో భారీ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు అధికారులు చెబుతున్నారు. దీనికి సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌తో కలిసి 50 లక్షల టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వ సంస్థ ‘గజ్‌ప్రొమ్‌’ ఆసక్తి.. సుమారు రూ.6 వేల కోట్ల వ్యయంతో టెర్మినల్ నిర్మించ‌నుంది.

ఈ క్ర‌మంలో సీఎం చంద్ర‌బాబు స‌హా .. ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో ఈ వారంలో ఢిల్లీలో కీలక చర్చలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. కాకినాడ సీ పోర్ట్స్‌, గజ్‌ప్రొమ్‌, ఢిల్లీలోని రష్యన్‌ ఫెడరేషన్‌ ఎంబసీ ప్రతినిధుల‌తో స‌ర్కారు చ‌ర్చించి.. తుది నిర్ణ‌యం తీసుకుంటుంది. ప్ర‌స్తుతం ఈ సంస్థ రష్యా ప్రభుత్వ విద్యుత్‌ రంగంలో ప్రముఖ సంస్థగా ఉంద‌ని అధికారులు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యా-భార‌త్ మ‌ధ్య సంబంధాలు పెరుగుతున్న క్ర‌మంలో భారత్‌లో ఓడరేవులు, గ్యాస్‌ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలనే వ్యూహంలో భాగంగా ‘గజ్‌ప్రొమ్‌’ నిర్ణయం తీసుకుంద‌ని.. దీనికి ఏపీని ఎంచుకుంద‌ని స‌మాచారం.