జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శనివారం సాయంత్రం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఉదయం ప్రభుత్వ కార్యక్రమంలో ఆటోడ్రైవర్ల సేవలో.. పాల్గొ్న్న అనంతరం.. నేరుగా మంగళగిరికి చేరుకున్నారు. అ నంతరం.. ఆయన పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. అప్పటికే వారికి రెండు రోజుల కిందట సమాచారం చేరవేశారు. ప్రజాప్రతినిధుల సమావేశం ఉంటుందని.. నియోజకవర్గం సమస్యలతో రావాలని పవన్ సూచించారు. దీంతో కొందరు ఎమ్మెల్యే లు వచ్చారు. మరికొందరు ముందుగానే ఆయన పర్మిషన్ తీసుకుని వేరే కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఇక, ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు సమాచారమే ఇవ్వకుండా ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. ఇదిలావుంటే.. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పవన్ కల్యాణ్ చర్చించారు. నియోజకవర్గంలో సమస్యలు సహా.. దూకుడగా ఉన్న నాయకులపై ఆయన చర్చించారు. “మీరు సీనియర్. కానీ, ఆ హుందాతనం నిలబెట్టుకోవాలి. మీరే ఇలా మాట్లాడితే.. ఇలా చేస్తే.. నేనెవరికి చెప్పాలి. మీకు చెప్పాలా? వేరే వారు తప్పుచేస్తే.. వారికి చెప్పాలా?”అని ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. సదరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆయన హోం వర్క్ చేయకపోవడాన్ని కూడా పవన్ తప్పుబట్టారు.
మరికొందరు ప్రజాప్రతినిధులు.. సభలో అడిగిన ప్రశ్నలు.. కూడా పవన్ చర్చించారు. ముఖ్యంగా పొల్యూషన్ విషయంలో సభ లో చర్చ జరిగినప్పుడు.. సభలోనే ఉన్న జనసేన ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించలేదన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆయనప్రశ్నించారు. ప్రభుత్వం అంటే అందరిదీ అని.. కొన్ని కొన్ని కార్యక్రమాలు మినహా అన్నీ కలిసి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయినా.. కొందరు మాత్రం దూరంగా ఉంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒకరిద్దురు ఎమ్మెల్యేల కారణంగా.. పార్టీ ఇబ్బందుల్లో పడుతోందంటూ.. నెల్లిమర్ల ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకువచ్చారు. కానీ, ఆ ఎమ్మెల్యే సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో ఆచర్చను అక్కడితో ఆపేశారు.
ఇక, క్షేత్రస్థాయిలో నాయకులను కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తేల్చి చెప్పారు. అందరూ హ్యాపీగా ఉండాలన్నదే పార్టీ పాలసీ అని.. కొందరు పదవులు అనుభవిస్తూ.. మరికొందరు బాధపడడం సరికాదని.. మనం వారికి చేరువ అయితే.. ఆ బాధ పోతుందని హితవు పలికారు. ఎంతో మంది వేచి చూస్తున్నా.. కొందరికే టికెట్ దక్కిందంటే.. వారందరూ అర్హులు కాక కాదని.. వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గాలకు చేరువ గా ఉంటూ.. ప్రజల సమస్యలు, పార్టీ నాయకుల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates