ఆటో డ్రైవర్ల సేవలో..భారమైనా మోస్తాం: పవన్

విజయవాడలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవలో బహిరంగ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం అమలు చేసేందుకు 436 కోట్ల రూపాయల భారం ఖజానాపై పడుతుందని, అయినా సరే బాధ్యతతో ఆ భారాన్ని సంతోషంగా భరిస్తూ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించిందని అన్నారు. ఆటో డ్రైవర్లకు చిన్నపాటి ఊతమిచ్చినా చాలని తాము భావించామని చెప్పారు. అర్హులైన వారికి ఏటా 15 వేలు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న గ్రీన్ ట్యాక్స్ సమస్యను, రోడ్లపై గుంతల సమస్యను పరిష్కరించామని చెప్పారు.

స్త్రీ శక్తి పథకం అమలు సమయంలో ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేశామని అన్నారు. ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తే ఆటో డ్రైవర్ల ఉపాధికి ఇబ్బంది అవుతుందని, తమ పరిస్థితి ఏంటని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తారని చర్చించామని అన్నారు. కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్స్ గురించి హామీ ఇచ్చారని, కచ్చితంగా వారికి న్యాయం చేద్దామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ 15 వేల రూపాయలు ఇస్తున్నామని, అందుకోసం సీఎం చంద్రబాబుకి ఆటో డ్రైవర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వంటి సమర్థవంతమైన నాయకత్వం ఉంటే పాలన ఇలా ఉంటుందని చెప్పారు.

ఎన్నికలకు ముందు పిఠాపురం పర్యటనలో ఆటోలో ప్రయాణించినపుడు ప్రత్యేకంగా వారి ఇబ్బందులు తెలుసుకున్నానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ పథకం అమలు భారమని, అయినా సరే ఆనందంగా దాన్ని మోస్తామని పవన్ వెల్లడించారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు అండగా ఉంటామని హామీనిచ్చారు.