సీఎం చంద్రబాబు అంటేనే మాటల మాంత్రికుడుగా పేరు తెచ్చుకున్నారు. ఏ విషయాన్నయినా అలవోకగా స్పృశించే సీఎం చంద్రబాబు.. తాజాగా విజయనగరం జిల్లాలో పర్యటించి.. గత 15 మాసాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గుక్క తిప్పుకోకుండా వివరించారు. అంతేకాదు.. ఇదేసమయంలో ఆయన వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలకు, ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమానికి పోలిక పెడుతూ.. ఏకేశారు. ఈ క్రమంలో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను కూడా ఆయన ప్రస్తావించారు. మానవత్వంతో సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు.
వివక్షలేని విధంగా రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు యూపీలో ఇప్పటికీ సామాజిక భద్రతా పింఛను రూ.500 మాత్రమే ఉందన్నారు. కానీ, ఏపీలో మాత్రం రూ.4000 నుంచి రూ.6000 వరకు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు.. ఉచిత బస్సు విషయంలో ఇతర రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నాయని కానీ.. ఏపీలో మాత్రం అన్ని రకాల బస్సుల్లో దాదాపు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. అందుకే.. ఇతర రాష్ట్రాల్లో రోజుకో వివాదం వెలుగు చూస్తోదని.. కానీ, ఏపీలో మాత్రం ఎక్కడా వివాదాలు లేకుండా ఈ పథకం అమలు జరుగుతోందని చెప్పారు.
ఇక, కీలకమైన ఉద్యోగాల విషయంలో కేవలం 15 మాసాల్లోనే 4.7 లక్షల మందికిఉద్యోగాలు ఇచ్చామని సీఎం చంద్రబాబు వివరించారు. ఇలా చేయడం రాష్ట్రంలోనేకాదు.. దేశంలోనే రికార్డుగా చెప్పుకొచ్చారు. “కొన్ని ప్రభుత్వాలు.. అవి పనిచేయవు. ఇంత చేసి.. అంత అని చెప్పుకొంటాయి. మేం అధికారంలోకి రాగానే 4.7 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తెచ్చాం. మరో 9 లక్షల కోట్ల పెట్టుబడులు త్వరలోనే రానున్నాయి. దీనివల్ల మరో 9 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. కానీ,గత ప్రభుత్వం ఏదో ఇచ్చామని చెబుతూ.. అన్నీ నాశనం చేసింది. ఇచ్చింది ఏమీ లేదు. మీ నుంచి తీసుకున్నదే ఎక్కువ“ అని వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
ఇక, విద్యుత్ చార్జీల విషయాన్ని కూడా ప్రస్తావించిన సీఎం.. గత ప్రభుత్వంలో బాదుడే బాదుడు బాదారని.. దీంతో అనేక మంది పనులు కోల్పోయి.. ఉపాధి పోయి.. ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ చార్జీలను పెంచడంతో చిన్న,సన్నకారు పరిశ్రమలు మూతబడ్డాయన్నారు. ఇప్పుడు విద్యుత్ చార్జీలను పెంచడం కాదు.. తగ్గించే స్థాయికి వచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోలేక పోతున్న వైసీపీ నాయకులు.. ప్రజలకు లేనిపోని విషాన్ని నూరి పోస్తున్నారని విమర్శించారు. నవంబరు నుంచి యూనిట్‌కు 13 పైసలు చొప్పున ధరలు దిగివస్తాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ కూటమిదే విజయమని మరోసారి చంద్రబాబుతెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates