జ‌న‌సేన‌కు కంచుకోట‌గా పిఠాపురం.. ప‌క్కా స్ట్రాట‌జీ ఇదే!

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గ‌త ఎన్నిక‌ల్లో పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కిం చుకున్నారు. కూట‌మిక‌ట్టి.. పిఠాపురం టికెట్‌ను సొంతం చేసుకున్న ఆయ‌న‌.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యాన్ని కూడా కైవ‌సం చేసుకున్నారు. ఇక‌, ముందు కూడా.. ప‌వ‌న్ ఇక్క‌డ నుంచే పోటీ చేస్తార‌ని.. గ‌తంలోనే పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ నాగ‌బాబు చెప్పిన విష‌యం తెలిసిందే. అయితే.. సంస్థాగతంగా మాత్రం.. పార్టీ ఇంకా పుంజుకోవాల్సి ఉంది.

అంటే.. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల‌, గ్రామ క‌మిటీలను ప్ర‌క్షాళ‌న చేయాల్సి ఉంద‌ని భావిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల, గ్రామ క‌మిటీల‌ను నియ‌మించారు. అయితే.. వారు స‌రైన విధంగా పార్టీని ముందుకు న‌డిపించ‌లేకపోతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. అంతేకాదు.. ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత‌ల‌తోనూ కొంద‌రు క‌లివిడిగా ఉంటూ.. ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో వెనుక‌బ‌డుతున్నార‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో మండ‌ల‌, గ్రామ క‌మిటీల్లో మార్పు అనివార్యంగా క‌నిపిస్తోందని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. సుధీర్ఘ‌కాలంగా మండ‌ల‌, గ్రామ క‌మిటీల అధ్య‌క్షులు, కార్య‌ద‌ర్శులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌వారిలో కొంత‌మందిని ప‌క్క‌న‌పెట్టి.. కొత్త వారికి లేదా.. యువ‌రక్తానికి అవ‌కాశం ఇవ్వాల‌న్న ఆలోచ‌న చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మం కూడా రాబోయే రెండు వారాల వ్య‌వ‌ధిలో ఉంటుంద‌ని సీనియ‌ర్లు అంటున్నారు. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నియోక‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్న నేప‌థ్యంలో మార్పులు చేస్తార‌ని తెలుస్తోంది.

స్థానికాన్ని గుర్తించే..

వ‌చ్చే ఏడాది రాష్ట్రంలో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో పిఠాపురం వంటి సొంత నియోజక‌వ‌ర్గంలో అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయ‌తీల‌ను కూడా త‌మ‌వైపు తిప్పుకోవాల‌న్న‌ది జ‌న‌సేన పార్టీ ల‌క్ష్యంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే.. పిఠాపురంలో మార్పుల దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన పూర్తిగా పుంజుకుంటుంద‌ని.. అంటున్నారు సీనియ‌ర్ నేత‌లు.