ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ నియోజకవర్గం పేరు చెబితే.. గుర్తుకు వచ్చేది.. గత ఏడాది కిందటి వరకు ఘర్షణలు.. గంజాయి.. పేకాట.. కేసినో వంటివే వినిపించేవి, కనిపించేవి కూడా! అని టీడీపీ నాయకులు విమర్శించే వారు. అయితే, గత ఏడాది ఎన్నికల్లో ఎన్నారై, టీడీపీనాయకుడు వెనిగండ్ల రాము ఇక్కడ విజయం దక్కించుకున్నారు. దీంతో ఇక్కడి రూపు రేఖలు సమూలంగా మారుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నారు.
అయితే.. ఇతర ఎమ్మెల్యేల మాదిరిగా ఇదొక్కటే రాము చేస్తే.. గుడివాడలో చరిత్ర సృష్టించే అవకాశం పెద్దగా ఉండేది కాదు. కానీ.. ఆయన భిన్నంగా ఆలోచన చేశారు. ఇక్కడి యువతకు ఐటీ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా గుడివాడలో `ప్రిన్స్‌టన్ ఐటీ` సర్వీసెస్ కంపెనీ కొత్త క్యాంపస్ ఏర్పాటుకు ఎమ్మెల్యేగా విశేష కృషి చేశారు. తాజాగా దసరాను పురస్కరించుకుని తన మొట్టమొదటి ఐటీ కంపెనీ కార్యాలయాన్ని గుడివాడలో ఏర్పాటు చేసింది. తొలి నెలలోనే స్థానికంగా ఐటీ చదవిన వారికి వంద ఉద్యోగాలు కల్పించనున్నారు.
ఈ క్యాంపస్ ప్రారంభం, రాష్ట్రంలో ఐటీ సెక్టార్‌కు ఇతర ప్రాంతాల్లోకి విస్తరించడానికి మరో మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక జైన్ టెంపుల్ స్ట్రీట్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంపస్ నుంచే ప్రిన్స్‌టన్ ఐటీ సర్వీసెస్, ఒరాకిల్ టెక్నాలజీ సొల్యూషన్లు, క్లౌడ్ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, సిస్టమ్ సపోర్ట్‌లలో సేవలు అందించనున్నారు. వాస్తవానికి ఈ కంపెనీకి హైదరాబాద్, న్యూయార్క్(అమెరికా)లో మాత్రమే వింగ్స్ ఉన్నాయి. తొలిసారి ఎమ్మెల్యే రాము కృషి ఫలించి.. ఇక్కడ క్యాంపస్ ఏర్పాటు చేయడం గమనార్హం.
“గుడివాడ యువతకు అవకాశాలు కల్పించడమే లక్ష్యం. ఇక్కడి తక్కువ ఖర్చు, ప్రతిభావంతులు ఉన్నారు.“ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వ్యాఖ్యానించారు. స్వయంగా ఆయన ఎన్నారై కావడంతో ఆయన అక్కడి ఐటీ కంపెనీలతో మాట్లాడి కార్యాలయలను ప్రారంభించే ప్రయత్నాలు చేశారు. ఈ క్యాంపస్ లో ఉద్యోగులుగా గుడివాడ వారినే నియమించుకుంటారని ఎమ్మెల్యే చెప్పడం మరో విశేషం. ఏదేమైనా.. ఒకప్పుడు గుడివాడ అంటే.. గుర్తొచ్చే వివాదాలకు చెక్ పెట్టి.. ఇప్పుడు ఐటీ కేంద్రంగా మార్చడం వెనుక ఎమ్మెల్యే కృషి చాలానే ఉందనితెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates