కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్.. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఉరఫ్ దామన్న కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గాల్లో దామోదర్‌రెడ్డి మంత్రిగా పనిచేశారు. పార్టీకి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆసాంతం.. కాంగ్రెస్ నేతగానే జీవించారు. ఒకానొక దశలో ఇతర పార్టీల నుంచి పిలుపు వచ్చినా.. ఆయన `కన్నతల్లి కాంగ్రెస్` అంటూ.. ఆ పార్టీలోనే కొనసాగారు.
అంతేకాదు.. ఒకదశలో అధిష్టానం తనకు టికెట్ నిరాకరించిన ప్పుడు ఇండిపెండెంటుగానే పోటీ చేశారు తప్ప.. వేరే పార్టీ పిలిచినా ఆయన చేయిని వదలిపెట్టేందుకు ఇష్టపడలేదు. ఇలా.. కాంగ్రెస్ పార్టీతో పేగు బంధం ఏర్పరుచుకున్న దామోదర్ రెడ్డి.. యువ నాయకుడిగా క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన ప్రస్థానం దేదీప్య మానంగా వెలిగిపోయినా.. అది అంత ఈజీగా అయితే.. సాగలేదు. కమ్యూనిస్టులకు కంచుకోట వంటి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్‌ను నడిపించే బాధ్యతలు తీసుకున్న ఆయన తొలిసారి తుంగతుర్తి నుంచి 1985లో విజయం దక్కించుకున్నారు.
ఆ తర్వాత.. కూడా వరుస విజయాలు అందుకున్న ఆయన.. 1999లో మాత్రమే ఒక్కసారి పరాజయం పాలయ్యారు. అప్పుడే పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన స్వతంత్రంగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో 2004, 2009లో మళ్లీ పిలిచి పిల్లనిచ్చినట్టు కాంగ్రెస్ పార్టీనే ఆయన టికెట్ ఇవ్వగా.. ఆ ఎన్నికల్లో ఘన విజయం దక్కించుకున్నారు. చిత్రం ఏంటంటే.. కమ్యూనిస్టు ఖిల్లాగా పేరొందిన నల్లగొండ జిల్లాలో 1985లో అనేక మంది పోటీ చేసినా.. ఒక్క దామోదర్ రెడ్డి మాత్రమే విజయం దక్కించుకున్నారు. ఆసాతం కాంగ్రెస్ వాదిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దామోదర్.. వైఎస్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.
ఆ సమయంలోనే ఆయన సైబరాబాద్ సిటీ డెవలప్ మెంటు కోసం ప్రత్యేక కృషి చేశారు. టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నిర్మించారన్న కారణంగా దానిపై వివక్ష చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన దామన్న.. సైబర్‌బాద్‌ను డెవలప్ చేయడంతో కీలక పాత్ర పోషించారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత.. 2014, 2019, 2023లో జరిగిన ఎన్నికల్లో వరుస పరాజయాలు పొందారు. అయినప్పటికీ.. ఆయన పార్టీలోనే కొనసాగుతూ.. ప్రస్తుతం సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే.. గత ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామన్న.. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates