`గూగుల్`కు అడ్డు ప‌డుతోందెవ‌రు: చంద్ర‌బాబు ఆరా

ఏపీలో పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వానికి వైసీపీ నాయ‌కులు ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా అడ్డు ప‌డుతున్నార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “వారు పెట్టుబ‌డులు తీసుకురాలేదు. ఇప్పుడు తెస్తుంటే అడ్డుప‌డుతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షించేది లేదు. ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే“ అని సీఎం తేల్చి చెప్పారు. విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకునేందుకురెడీ అయింది. అయితే.. ముందుగా భూ సేక‌ర‌ణ కోసం ప్ర‌య‌త్నిస్తోంది.

`గూగుల్ డేటా సెంట‌ర్‌` రాక‌తో విశాఖ రూపు రేఖ‌లు మారుతాయ‌ని.. ఐటీ రాజ‌ధానిగా విశాఖ భాసిల్లుతుంద‌ని ప్ర‌భుత్వం భావి స్తోంది. దీనిపై చాలానే ఆశలు పెట్టుకుంది. ఈ క్ర‌మంలో డేటా సెంట‌ర్ ఏర్పాటుకు వీలుగా భూ సేక‌ర‌ణ‌కు అధికారులు ప్ర‌య‌త్నిస్తున్నారు. సంబంధిత రైతుల‌ను కూడా ఒప్పంచేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే.. స‌ద‌రు భూముల విష‌యంపై కోర్టుల‌లో పిటిష‌న్లు ప‌డ్డాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్ల‌లో రైతుల పేర్ల‌ను ప‌రిశీలించిన స‌ర్కారు.. వీరిలో ఒక‌రిద్ద‌రు ఎప్పుడో చ‌నిపోయిన వారేన‌ని గుర్తించింది. దీంతో ఈ పిటిష‌న్ల వెనుక కుట్ర చోటు చేసుకుంద‌ని భావించి.. తాజాగా చ‌ర్య‌ల‌కు ఆదేశించింది.

బుధ‌వారం విశాఖ‌లో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన భూ సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఎక్క‌డిదాకా వ‌చ్చింద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేందిర ప్ర‌సాద్‌ను విచారించారు. అయితే.. కోర్టులో కేసులు న‌మోద‌య్యాయ‌ని.. వీటి విష‌యంలో స్పందించాల్సిఉంద‌ని తెలిపారు. కానీ, ఆ పిటిష‌న్ల‌ను ఎవ‌రు దాఖ‌లు చేశారు? వీరి వెనుక ఎవ‌రున్నారు? అనే విష‌యాల‌పై స్ప‌ష్టత లేకుండా పోయింద‌న్నారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం చంద్ర‌బాబు.. ఇవ‌న్నీ..వైసీపీ నే చేయిస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం బాగుప‌డ‌డం ఆ పార్టీకి ఇష్టం లేద‌న్నారు. రైతుల పేరుతో పిటిష‌న్లు వేసిన వారిని గుర్తించి.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ భూముల సేక‌ర‌ణ జ‌ర‌గాల‌ని సూచించారు.

ప‌రిహారం డ‌బుల్‌!

డేటా సెంట‌ర్ కోసం.. ఇచ్చే భూముల విష‌యంలో సీఎం చంద్ర‌బాబు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కొంద‌రు రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావ‌డం లేద‌ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్ర‌బాబు.. ప‌రిహారం రెట్టింపు ఇస్తున్నామ‌ని.. అయినా.. చాల‌దంటే ఎలా? అని ప్ర‌శ్నించారు. వాస్త‌వానికి కేంద్రం చేసిన చ‌ట్టం ప్ర‌కారం.. భూసేక‌ర‌ణ కింద ప‌రిహారం ఇస్తామ‌ని.. ఇక్క‌డ మాత్రం దీనినిడ‌బుల్ ఇస్తున్నామ‌ని చెప్పారు. రైతుల‌ను ఒప్పించి.. భూములు తీసుకునేందుకు .. పార్టీ త‌ర‌ఫున కూడా ప్ర‌య‌త్నాలు చేయాల‌ని ఆయ‌న సూచించారు.