“తెలుగు వారి ఇలవేల్పు.. కనక దుర్గమ్మ సన్నిధిని కూడా గత పాలకులు అపవిత్రం చేశారు. వెండి సింహాలు ఎత్తుకుపోయి అమ్ముకున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరించారు. దుర్గమ్మ ఆలయంలో అపవిత్ర కార్యక్రమాలు జరిగినా.. దొంగతనాలు జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. ఏం చెప్పాలో తెలియడం లేదు. దుర్గమ్మ సన్నిధిలో అలాంటి దుర్మార్గుల గురించి మాట్లాడడం దురదృష్టకరం. అయినా.. తప్పడం లేదు. అందుకే అలాంటి దుర్మార్గులను దుర్గమ్మే అధికారం నుంచి దించేసింది. సుపరిపాలనను రాష్ట్రానికి అందించాలని మమ్మల్ని ఆశీర్వదించింది.“ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సమేతంగా పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఆలయానికి చేరుకున్న ఆయన.. సరస్వతీ రూపంలో దర్శనమిచ్చిన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం.. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత.. మీడియాతో మాట్లాడిన సీఎం.. గతంలో తాను తొలిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పటికీ.. ఇప్పటికీ.. అనేక మార్పులు తీసుకువచ్చామన్నారు. అప్పట్లో ఇరుగ్గా ఉన్న ఆలయాన్ని విస్తరించామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న విస్తరణలన్నీ.. గతంలో తాము చేసినవేనని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను పరోక్షంగా విమర్శించారు. “ఇక్కడే ఒక నాయకుడు ఉండేవాడు. ఆయన వ్యాపారి. అన్నీ వ్యాపార దృష్టితోనే చూసేవాడు. దీంతో సామాన్యులకు అమ్మవారి దర్శనం దుర్లభంగా మారింది. దసరా వచ్చిందంటే.. కమీషన్ల కోసం ఎగబడే వారు. వెండి సింహాలను ఎత్తుకుపోయి అమ్ముకున్నారు. చెప్పుల స్టాండ్ల టెండర్లను కూడా సొంత వారికి ఇచ్చి వ్యాపారం చేశారు. ఇన్ని దురాగతాలు చేశారు కాబట్టే.. అమ్మవారు వారిని తన్ని తరిమేసింది.“ అని వ్యాఖ్యానించారు. దుర్గమ్మ సన్నిధిలో రాజకీయాలు మాట్లాడడం తనకు ఇష్టం లేకపోయినా.. తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వస్తోందన్నారు.
ఇక, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కనక దుర్గమ్మను కోరుకున్నట్టు సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నీటి తో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. గత 15 మాసాలుగా రాష్ట్రంలో సుపరిపాలన అందుతోందన్న సీఎం.. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింతగా ప్రభుత్వం చేరువ అవుతుందని తెలిపారు. ప్రస్తుత దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. అమ్మవారి ఆలయంలో మరిన్ని అభివృధ్ధి పనులు చేపడుతున్నట్టు చెప్పారు. నూతన అన్నప్రసాద భవన నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందన్నారు. లడ్డూ ప్రసాదం తయారీకి తిరుమల తరహాలో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates