వైసీపీ నాయకుడు, రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి బెయిల్ లభించింది. అయితే.. కోర్టు కొన్ని షరతులు విధించింది. వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏ-4 నిందితుడిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పలు మార్లు విచారించి.. అరెస్టు చేసింది. దీంతో విజయవాడలోని ఏసీబీ కోర్టు.. మిథున్ రెడ్డికి జైలు విధించింది. రిమాండ్ ఖైదీగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. పలుమార్లు కోర్టును అభ్యర్థించారు. గతంలో రెండు పిటిషన్లను కొట్టేసిన ఏసీబీ కోర్టు.. తాజాగా జరిగిన విచారణలో మాత్రం ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ప్రాసిక్యూషన్ సరైన ఆధారాలను సమర్పించలేదని కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. బెయిల్ మంజూరు చేస్తే.. మిథున్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కోర్టుకు వివరించారు. దీంతో కొన్ని షరతులు విధించింది.
ఇవీ షరతులు..
1) పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలి.
2) మీడియాతో కేసు వివరాలు పంచుకోరాదు.
3) రెండు లక్షల రూపాయల పూజీకత్తు సమర్పించాలి.
4) విచారణకు సహకరించాలి. ఎప్పుడు పిలిచినా రావాలి.
5) దేశం విడిచి వెళ్లరాదు.
6) కేసుకు సంబంధించి బహిరంగ ప్రకటనలు జారీ చేయరాదు.
రామచంద్రారెడ్డి కన్నీరు!
కాగా.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని రేపు విడుదలచేసే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు. కోర్టు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. లిఖిత పూర్వకంగా జైలు అధికారులకు ఈ రోజు రాత్రికి, లేదా రేపు ఉదయానికి మాత్రమే చేరుతాయని.. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత.. రేపు ఉదయం ఆయనను జైలు నుంచి విడుదల చేయొచ్చని చెబుతున్నారు. కాగా.. ఈ కోర్టు ఆదేశాలు ఇచ్చే సమయంలో మాజీ మంత్రి, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. తమను, తమ కుటుంబాన్నీ రాజకీయ వైరంతోనే చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తోందని ఆయన ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates