తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీ అధినేత విజయ్ శనివారం తమిళనాడులోని కరూర్ లో చేపట్టిన ర్యాలీలో 40 మంది దాకా మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనతో విజయ్ ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఘటన జరిగిన తర్వాత ఆయన గట్టి భద్రత మధ్య కరూర్ నుంచి చెన్నై వెళ్లిపోయారు. తాజాగా ఆదివారం ఉదయం కాస్తంత తేరుకున్న విజయ్ చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ఓ మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారాన్ని ఇవ్వనున్నట్టు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు సదరు ప్రకటనలో విజయ్ తెలిపారు.
సాధారణంగా రాజకీయ పార్టీ నేతలు నిర్వహించే ర్యాలీల్లో ఈ మేర తొక్కిసలాట జరగడం దాదాపుగా అరుదే. అయితే ఊహించని దానికంటే అధికంగా జనం రావడంతో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగినట్లు అనుమానిస్తున్నారు. విజయ్ ర్యాలీకి కేవలం 50 వేల మంది హాజరు అవుతారని పోలీసులు భావించారు. అది కూడా టీవీకే ఇచ్చిన సమాచారం ఆధారంగానే పోలీసులు ఆ 50 వేల మందిని నియంత్రించేందుకు 500 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే 50 వేలు అనుకున్న జనం ఏకంగా 5 లక్షల వరకు చేరిపోయింది. దీంతో జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. ఫలితంగానే తొక్కిసలాట చోటుచేసుకుంది.
ఇదిలా ఉంటే… టీవీకే అధినేత విజయ్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తొక్కిసలాట జరిగి 40 మంది చనిపోయారని తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి, అంతమంది చనిపోవడానికి కారణమైన విజయ్ ను తక్షణమే అరెస్టు చేయాలని ఆయా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు చెన్నైలోని విజయ్ నివాసం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. విజయ్ నివాసంపై దాడులు జరిగే ప్రమాదం ఉందన్న నేపథ్యంలోనే ఈ భద్రత ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates