‘ఆటో’వాలా జిందాబాద్‌.. 4నే నిధులు!

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వం మ‌రో కీల‌క ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోడ్రైవ‌ర్ల‌కు.. ఏడాదికి రూ.15000 ఇచ్చే కార్య‌క్ర‌మానికి సంబంధించి సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే నెల 4 నుంచి ఈ ప‌థ కాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేసిన‌ట్టు చె ప్పారు. ఏ ఒక్క‌రికీ అన్యాయం జ‌ర‌గ‌ద‌ని.. ఆటో డ్రైవ‌ర్ల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కూడా తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా ఉండాల‌న్న‌దే సుప‌రిపాల‌న ల‌క్ష్య‌మ‌ని చెప్పారు.

ఎందుకీ ప‌థ‌కం?

గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేతగా చంద్ర‌బాబు.. ‘సూప‌ర్ సిక్స్‌’ హామీలు ఇచ్చారు. వీటిలో ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణాన్ని ఆయ‌న ప్ర‌తిపాదించారు. దీనిని ఈ ఏడాది ఆగ‌స్టు 15 నుంచి అమ‌లు చేస్తున్నారు. అయితే.. ఆర్టీసీలో ఉచిత‌ప్ర‌యాణం కార‌ణంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆటోలు, ట్యాక్సీల‌లో ప్ర‌యాణించే మ‌హిళ‌లు.. కుటుంబాలు(ఎందుకంటే ఒక కుటుంబంలో మ‌హిళ‌లు ఆర్టీసీ బ‌స్సుల్లో వ‌స్తే.. ఇత‌ర స‌భ్యులు విడిగా రారు కదా!) ఆటోలు ఎక్కే అవ‌కాశం ఉండ‌ద‌ని.. దీంతో త‌మ ఉపాధిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని డ్రైవ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలో ఎవ‌రూ కోర‌కుండానే సీఎం చంద్ర‌బాబు తొలినాళ్ల‌లోనే ఆటోవాలాల‌కు ఆర్థిక సాయం ఇచ్చే ప్ర‌తిపాద న‌పై దృష్టి పెట్టారు. తొలుత ఏడాదికి రూ.10 వేలు చొప్పున ఇవ్వాల‌ని అనుకున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయి నుంచి తెప్పించుకున్న స‌మాచారం, నివేదిక‌ల ఆధారంగా ఈ సొమ్మును రూ.15 వేల‌కు పెంచారు. ఇదే విష‌యాన్ని ఆగ‌స్టు 15న ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని ప్రారంభించే స‌మ‌యంలోనే ఎనౌన్స్ చేశారు. తాజాగా దీనికి సంబంధించి అసెంబ్లీలోను.. త‌ర్వాత మీడియా ముందు కూడా సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. వ‌చ్చే నెల 4 నుంచి ఆటోవాలాల‌కు.. రూ.15 వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు.

ఇవీ.. నిబంధ‌న‌లు..

1) ‘ఆటో డ్రైవ‌ర్ల సేవ‌లో’ ప‌థ‌కం కింద ఏటా రూ.15 వేలు పొందాల‌నుకునే వారికి ఆర్టీఏ అధికారులు ఇచ్చే లైసెన్సు ఉండాలి.

2) లైసెన్సుతోపాటు.. బ్యాడ్జ్‌(లైట్ మోట‌ర్ వెహిక‌ల్‌) ఉండాలి.

3) సొంత ఆటో ఉండాలి.

4) అద్దె దారులు అయితే.. దానికి సంబంధించి య‌జ‌మాని ఇచ్చే స‌ర్టిఫికెట్‌(నోట‌రీ) స‌మ‌ర్పించాలి.

5) వ‌య‌సు 60 ఏళ్లు మించ‌రాదు.

6) పురుషులు, మ‌హిళ‌ల‌కు కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.

7) ఒకే విడ‌త‌లో రూ.15000 చొప్పున బ్యాంకులో జ‌మ‌చేస్తారు.

8) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ నిధి కింద రూ.2000ల‌ను మిన‌హాయించుకోనున్నారు.(దీనిపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది.)