పవన్ కు జ్వరం…చికిత్స కోసం హైదరాబాద్ పయనం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఈ వారంలో సోమవారమే ఆయన జ్వరం బారిన పడినా… సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అయితే జ్వరం తీవ్రత పెరగడంతో ఆయన మంగళగిరిలోని తన నివాసంలోనే చిన్నపాటి చికిత్సలు తీసుకుంటూ విశ్రాంతి తీసుకున్నారు. అయితే వైరల్ ఫీవర్ ప్రభావం మరింత తీవ్రం కావడంతో వైద్యులు హైదరాబాద్ లో మరింత మెరుగైన చికిత్స తీసుకోవాలని సూచించారు. దీంతో శుక్రవారం ఆయన మంగళగిరి నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

సాధారణంగా చిన్న చిన్న జ్వరాలను పవన్ పెద్దగా లెక్క చేయరు. అదే సమయంలో ఏదో చిన్న సుస్తీ చేసిందని తన దినచర్యను కూడా మార్చుకోరు, వాయిదా కూడా వేసుకోరు. అయితే పవన్ నాలుగు రోజులుగా తన నివాసం నుంచి బయటకు రాలేదంటే ఆయనకు వచ్చిన జ్వరం ఒకింత తీవ్రమైనదేనని చెప్పాలి. అసలే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఏ సమయంలో తనకు ఆరోగ్యం బాగైతే ఆ మరుక్షణమే సమావేశాలకు హాజరుకావాలన్న భావనతోనే ఆయన జ్వరం వచ్చినా మంగళగిరిని దాటి బయటకు వెళ్లలేదు.

అయితే చివరకు వైద్యుల సూచన మేరకు పవన్ అసెంబ్లీ సమావేశాలను ఓ నాలుగు రోజులు పక్కన పెట్టేసి చికిత్స నిమిత్తం హైదరాబాద్ బయలుదేరనున్నారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకుంటారని ఆయన అభిమానులు, పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. అయితే ఈ నాలుగు రోజుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ లెక్కన ఇక ఈ సమావేశాలకు పవన్ హాజరు కాలేరనే చెప్పక తప్పదు.

ఓ వైపు అసెంబ్లీలో పలు కీలక విషయాలపై పవన్ మాట్లాడిన తీరు, ఆ తర్వాత వాటిపై ఓ మంత్రిగా ఆయన తీసుకున్న చర్యలు జనాన్ని ఇట్టే ఆకట్టుకున్నాయి. పవన్ మరిన్ని రోజులు సభలో ఉండి ఉంటే బాగుండేదని చాలా మంది భావిస్తున్నారు. ఇక తను నటించిన తాజా సినిమా ఓజీ సూపర్ హిట్ అయిన నేపథ్యాన్ని కూడా పవన్ జ్వరం కారణంగా ఆస్వాదించలేకపోయారని చెప్పాలి. ఏదేమైనా పవన్ త్వరగా వైరల్ ఫీవర్ బారి నుంచి కోలుకోవాలని ఆశిద్దాం.