62 వేల కోట్లతో యుద్ధవిమానాలు.. చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం

భారత వాయుసేన (IAF) శక్తివంతమైన దళంగా ఎదగడానికి మరో కీలక అడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ మార్క్ 1A యుద్ధవిమానాల కొనుగోలుకు రక్షణ మంత్రిత్వశాఖ భారీ ఒప్పందంపై సంతకం చేసింది. మొత్తం 97 విమానాల కోసం రూ.62,370 కోట్లతో ఈ కాంట్రాక్ట్‌ కుదిరింది. ఇది చరిత్రలో ఎప్పుడూ లేనంత అతిపెద్ద ఒప్పందం అని తెలుస్తోంది.

ఈ ఒప్పందంలో 68 సింగిల్ సీటర్ ఫైటర్లు, 29 ట్విన్ సీటర్ ట్రైనర్లు ఉంటాయి. వీటితో పాటు వాయుసేనకు అవసరమైన అనుబంధ పరికరాలూ ఇవ్వబడతాయి. 2027-28 నుంచి ఈ విమానాల డెలివరీ ప్రారంభమవుతుంది. మొత్తం డెలివరీనీ 6 ఏళ్లలో పూర్తి చేయనున్నారు. దీంతో వాయుసేనలో ప్రస్తుతం సేవలు ముగించబోతున్న మిగ్ – 21 జెట్స్ స్థానాన్ని తేజస్ దళం భర్తీ చేయనుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, రేపటితో చివరి రెండు మిగ్ – 21 స్క్వాడ్రన్లను రిటైర్ చేయబోతున్న తరుణంలో ఈ ఒప్పందం కుదిరింది.

ఇప్పటికే 2021లో 83 తేజస్ విమానాల కోసం రూ.46,898 కోట్లతో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్‌లో ఆలస్యం జరిగింది. ఈసారి మాత్రం క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఆగస్టు 19న కొత్త ఆర్డర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విమానాల్లో 64 శాతం పైగా దేశీయ సాంకేతికతను వినియోగించనున్నారు. కొత్తగా యూటీటిఏఎమ్ ఏఈఎస్‌ఏ రాడార్‌, ‘స్వయం రక్షా కవచ’ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, స్వదేశీ యాక్యుయేటర్లు వంటి 67 కొత్త అంశాలు చేరబోతున్నాయి.

ఈ డీల్‌ వల్ల దేశీయ రక్షణ రంగానికి కూడా మరింత శక్తి లభించనుంది. తేజస్ ప్రోగ్రాంలో దాదాపు 105 భారతీయ కంపెనీలు సరఫరా గొలుసులో భాగమయ్యాయి. దీని ద్వారా ప్రతి సంవత్సరం 11,750 డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. వాయుసేనకు కావాల్సిన ఆధునిక యుద్ధవిమానాల అవసరమే కాకుండా దేశీయ రక్షణ ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి ఇది కీలక మలుపు అవుతుంది.

ఇక ఈ ఒప్పందంతో పాటు తేజస్ కు శక్తినిచ్చే 113 ఎఫ్ – 404 ఇంజిన్ల కోసం అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ (GE)తో కూడా ఒప్పందం కుదిరింది. దానిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మొత్తంగా ఈ నిర్ణయం వాయుసేన భవిష్యత్ దళాన్ని మరింత బలంగా మార్చే దిశగా ముందడుగుగా భావిస్తున్నారు.