ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ‘ఉప్పాడ’ తిప్ప‌లు.. విష‌యం ఏంటి?

ఉప్పాడ‌… ఈ పేరు విన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది చీర‌లు(ఉప్పాడ చీర‌లు). అదేస‌మ‌యంలో స‌ముద్ర ఉత్ప‌త్తులు కూడా. ఏపీలోని కాకినాడ తీర గ్రామ‌మైన ఈ ఉప్పాడ తాజాగా.. వార్త‌ల్లోకి ఎక్కింది. పెద్ద ఎత్తున ఇక్క‌డి మ‌త్స్య‌కారులు ఉద్య‌మానికి దిగారు. ర‌హ‌దారులు దిగ్భందించారు. ఒక‌రోజు కాదు..రెండు రోజులు కాదు.. గ‌త నాలుగు రోజులుగా నివురుగ‌ప్పిన నిప్పులా ఉద్య‌మిస్తున్న మ‌త్స్య‌కార కుటుంబాలు బుధ‌వారం తమ ఆందోళ‌న‌ను జాతీయ ర‌హ‌దారిపైకి ఎక్కించాయి. అంతేకాదు.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చి.. త‌మ‌కు హామీ ఇచ్చే వ‌ర‌కు ఆందోళ‌న‌ను విర‌మించేది లేద‌ని తేల్చి చెప్పారు.

ఏం జ‌రిగింది?

ఉప్పాడ‌లో దాదాపు వెయ్యికిపైగా మ‌త్స్యకార కుటుంబాలు.. సముద్రంలో వేట‌పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నాయి. అయితే.. స‌మీపంలో ప‌రిశ్ర‌మ‌లు.. త‌మ వ్య‌ర్థాల‌ను స‌ముద్రంలోకి వ‌దిలేస్తుండ‌డంతో కాలుష్యం ఏర్ప‌డి.. త‌మ జీవ‌నానికి పెను శాపంగా మారింద‌ని.. ఇక్క‌డి మ‌త్స్య‌కారులు గ‌త ఐదేళ్లుగా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ హ‌యాంలో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక సారిఉప్పాడ‌లో ప‌ర్య‌టించారు. మ‌త్స్య‌కారుల‌ను ఆదుకుంటామ‌ని.. వారికి ప్రాణ సంక‌టంగా మారిన ఈ కాలుష్య స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. “మేం అధికారంలోకి రాగానే.. మీ స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాం.” అని తేల్చి చెప్పారు.

అయితే.. జ‌న‌సేన‌-టీడీపీ-బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చినా.. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాలేదంటూ.. ఇక్క‌డి మ‌త్స్య‌కారులు తర‌చుగా ఆందోళ‌న‌కు దిగుతున్నారు. ఈ క్ర‌మంలో గ‌త నాలుగు రోజులుగా త‌మ ఆంందోళ‌న‌ను మ‌రింత తీవ్ర‌త‌రం చేశారు. బుధ‌వారం ఏకంగా.. జాతీయ ర‌హ‌దారిని కూడా దిగ్భందించి ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చి.. ఇచ్చిన హామీని నెర‌వేర్చాల‌ని కూడా డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. క‌లెక్ట‌ర్ ష‌ణ్ మోహ‌న్‌ను మ‌త్స్య‌కారుల వ‌ద్ద‌కు పంపించారు. వారి డిమాండ్ల‌ను తెలుసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఉప్పాడ స‌మ‌స్య‌పై క‌మిటీ వేస్తున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అసెంబ్లీలోనూ చ‌ర్చిస్తామ‌ని హామీ ఇచ్చారు. కానీ.. మ‌త్స్య‌కారులు మాత్రం శాంతించ‌లేదు. ప‌వ‌న్ వ‌చ్చే వ‌ర‌కు త‌మ ఆందోళ‌న‌ను కొన‌సాగిస్తామ‌ని తే్ల్చి చెప్పారు.

స‌మ‌స్య‌లు చాలా..

  • కాకినాడ జిల్లా ఉప్పాడలో రసాయన పరిశ్రమల వ్యర్థాలు స‌ముద్రంలో నేరుగా క‌లుస్తున్నాయి.
  • స‌ముద్ర ఉత్ప‌త్తుల‌పై కాలుష్య కార‌కాలు తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి.
  • పరిశ్రమల నుంచి విడుదల చేసిన రసాయనాల కారణంగా త‌మ జీవితాలు బుగ్గి అవుతున్నాయ‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు.
  • భవిష్యత్‌లో సముద్రంలో చేపలు దొరుకుతాయనే నమ్మకంలేదని వాపోతున్నారు.
  • ఉపాధి కోల్పోయిన త‌మ‌కు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

కొస‌మెరుపు: ఉప్పాడలో మెజారిటీ ప‌రిశ్ర‌మ‌లు.. కీల‌క రాజ‌కీయ పార్టీకి చెందిన నాయ‌కుల చేతిలో ఉన్నాయి. పైగా.. వారు బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డంతో స‌ర్కారుకు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.