దాదాపు ఏడు సంవత్సరాల పాటు.. ప్రజలను పిండేసిన వస్తు-సేవల పన్ను(జీఎస్టీ)లో సంస్కరణలు తీసుకువస్తూ..కేంద్రం చేసి న నిర్ణయం ఆదివారం(21-సెప్టెంబరు) అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీనిని మహా గొప్ప నిర్ణయంగా.. దేశ చరిత్రలో సువ ర్ణాక్షరాలతో రాయదగ్గ ఘట్టంగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జాతిని ఉద్దేశించి ఆదివారం సాయంత్రం ప్రసంగించిన ఆయ న జీఎస్టీకి తామే మూలమని పేర్కొన్నారు. అప్పట్లో జీఎస్టీని దేశ అభ్యున్నతి కోసం ప్రవేశ పెట్టామని చెప్పిన ఆయన.. ఇప్పుడు కూడా అదే సంకల్పంతో తగ్గించినట్టు తెలిపారు. మొత్తంగా.. జీఎస్టీని పెను విప్లవంగా.. దేశ ప్రజలపై కేంద్రం కురిపించిన అజరా మరమైన ప్రమామృత జల్లులుగా ఆయన అభివర్ణించారు.
అయితే..జీఎస్టీ శ్లాబులను రెండుగా వర్గీకరించి.. తగ్గించామని చెబుతున్నా.. నిత్యం వంటింట్లో వాడుకునే అనేక సరుకుల ధరలు పెరగనున్నాయని తెలిస్తే అవాక్కవుతారు. ఉద్దేశ ఊర్వకంగానే దాచి పెడుతున్న ఈ విషయంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. వాస్తవానికి జీఎస్టీని గత కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చింది. అప్పట్లో మూడే శ్లాబులు ఉన్నాయి. 5, 12, 14 శాతాల చొప్పున మాత్రమే పన్నులు విధించాలని జీఎస్టీని రూపొందించారు. ఇంతలో ప్రభుత్వం మారి మోడీ గద్దెనెక్కాక.. సంప్రదింపుల పేరుతో దీనిని నీతి ఆయోగ్‌కు అప్పగించారు. ఫలితంగా జీఎస్టీ శ్లాబులు.. సమూలంగా మారాయి. 5, 14, 18, 24 శాతాలుగా పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇవే అమల్లో ఉన్నాయి.
ఇక, ఇప్పుడు కూడా.. ఎక్కువ మందికి ఊరటనిచ్చే 14 శాతాన్ని ఎత్తేశారు. దీని స్తానంలో 18 శాతం శ్లాబును కొనసాగించారు. ఫలితంగా 5, 18 శాతం శ్లాబులు కొనసాగుతాయి. అయితే.. చిత్రం ఏంటంటే.. వీటి వల్ల నిజంగానే ధరలు దిగివస్తాయి. దీనిలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. ఇదేసమయంలో పైకి పెద్దగా ప్రచారంకాని మరో శ్లాబు కూడా అదే ఏకంగా 40 శాతం. ఇదీ.. అసలు సమస్య. ఇదే ప్రజలకు పెను భారంగా కూడా మారనుంది. ఉదాహరణకు దాల్చిన చెక్క, మిరియాలు, యాలుకలు, గసగసాలు, లవంగాలు, ఇంగువ, జీలకర్ర లేని వంటలు మన దేశంలో ఊహించలేం. వీటిని గతంలోనే సుగంధ ద్రవ్యాల జాబితాలో చేర్చారు. ఈ క్రమంలో.. వీటిని 24 శాతం పన్ను పరిధిలో ఉంచారు. అంటే.. ఇప్పటి వరకు అమలైన జీఎస్టీలో అతి పెద్ద శ్లాబు ఇదే.
కానీ, ఇక నుంచి అతి పెద్ద జీఎస్టీ శ్లాబు 40 శాతం. ఇప్పుడు సుగంధ ద్రవ్యాలను ఈ పన్ను శ్లాబులోకి చేర్చారు. అంటే.. ఆయా ధరలు మరింత కాదు.. రెట్టింపు పెరగనున్నాయి. ఇక, పొగరాయుళ్లు ఊది పడేసే సిగరెట్లు, చుట్టల ధరలు కూడా ఈశ్లాబులోనే చేర్చారు. సో.. ఈ ధరలు మరింత వాచిపోనున్నాయి. అదేవిధంగా మద్యంపై ఎక్సైజ్ ట్యాక్స్‌ను, మత్తు పానీయాలుగా పేర్కొన్న కొన్ని పదార్థాలను కూడా ఈ పన్ను శ్లాబులోకి చేర్చారు. గుట్కా, వక్కపలుకులను కూడా 40 శాతం పన్ను పరిధిలో చేర్చారు. ఇంతకన్నా ముఖ్యమైంది.. మరొకటి ఉంది. మహిళల బ్యూటీ వస్తువులు, అలంకరించుకున్నాక వంటికి రాసుకునే సెంట్లు, అత్తర్లు వంటివాటిని కూడా ఈ 40 శాతంలోకి చేర్చేశారు. మొత్తంగా చూస్తే.. జీఎస్టీతో తగ్గే ధరలతో పాటు గూబ వాచిపోయేవి కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలి. వీటిలో దేనినీ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates