రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్‌మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ అరాచకాలను ప్రతి ఇంటికీ వెళ్లి.. గడపగడపలోనూ వివరించాల్సిన అవసరం ఉందన్నారు. 2014-19 మధ్య స్వర్ణయుగం వంటి పాలనను గత ఎన్డీయే అందించిందన్నారు. కానీ, 2019-24 మధ్య ఒక్కఛాన్స్ అంటూ వచ్చిన గొడ్డలి పార్టీ అరాచకాలు సృష్టించిందని తెలిపారు.
అరాచక పార్టీని అంతమొందించిన ప్రజలు 151 మందిని 11 టీంగా మార్చేశారని లోకేష్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సుస్థిర పాలన సాగాలంటే.. అభివృద్ది జరగాలంటే.. గొడ్డలి పార్టీని శాశ్వతంగా సమాధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన చెల్లికి అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని అన్న బాలుడిని కాల్చి చంపారని, డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేశారని.. మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీబీఎన్ పాలనలో ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోంది. లక్ష కోట్ల రూపాయలతో సీమను అభివృద్ది చేస్తున్నారని తెలిపారు. చివరకు పులివెందుల నియోజకవర్గానికి కూడా నీరు అందిస్తున్నారని చెప్పారు. దేవుడి(తిరుమల)తో పెట్టుకున్న వారు ఏమయ్యారో చూస్తున్నామని వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అరాచక పాలన మరోసారి రాకూడదని చెప్పారు. దీనికిగాను పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుం బిగించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రాచరం చేయాలన్నారు.
ఆనాడు టీడీపీ జెండా లేకుండా చేస్తామన్నారని.. వైనాట్ 175 అంటూవిర్రవీగారని లోకేష్ అన్నారు. కానీ, ప్రజలు వారిని టీం-11కు పరిమితం చేస్తూ తీర్పిచ్చారని తెలిపారు. రాజకీయాల్లో చంద్రబాబు విరాట్ కోహ్లీ అని.. బౌలర్స్ మారినా.. బ్యాట్స్‌మెన్ ఆయనేనని లోకేష్ అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టనీయమని ఆనాడు వైసీపీ నాయకులు చెప్పారని.. కానీ, తాడేపల్లి ప్యాలెస్ గోడలు బద్దలు కొట్టి చంద్రబాబును గెలిపించిన ఘనత పసుపు సైన్యానిదని లోకేష్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
