2016, నవంబర్ 8… రాత్రి 8 గంటల సమయంలో ప్రధాన మంత్రి హోదాలో నరేంద్ర మోదీ ప్రత్యక్షమయ్యారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత జనం ఏ మేర ఇబ్బందులు పడ్డారో మనందరికీ తెలిసిందే. అప్పటికి ప్రధానిగా మోదీ పదవి చేపట్టి కేవలం ఏడాదిన్నర మాత్రమే అవుతోంది. అది గతం అయితే 11 ఏళ్లకు పైగా ప్రధానిగా అనుభవం సాధించిన మోదీ… ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు దేశ ప్రజలను ఉధ్దేశించి ప్రసంగించనున్నారు. గతానుభవం నేపథ్యంలో ఆదివారం నాటి మోదీ ప్రసంగం అమితాసక్తి నెలకొంది.
ఇప్పటిదాకా జీఎస్టీ పన్ను అమలులో పలు శ్లాబ్ లు ఉండేవి. అయితే ఆదివారం అర్థరాత్రి నుంచి ఆ శ్లాబ్ లన్నీ రద్దు అయ్యి కేవలం మూడంటే మూడు శ్లాబ్ లు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర కూడా వేసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కల్పించేలా నిత్యావసర వస్తువులను 5 శాతం జీఎస్టీలోకి తీసుకువచ్చారు. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎన్డీఏకు ఈ పరిణామం ఎంతో మేలు చేస్తుందన్న విశ్లేషణలు వినిపించాయి.
మరి ఆదివారం సాయంత్రం మోదీ చేసే ప్రసంగంలో జీఎస్టీ శ్లాబ్ ల ఊరట అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తారా? లేదంటే… 2016నాటి లాగా మరేదైనా కొత్త అంశాన్ని బాంబులా పేలుస్తారా? అన్న విషయంపై అయితే ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయా రంగాలకు చెందిన ఏ ఇద్దరు నిపుణులు కూడినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. మోదీ చేసే పనులన్నీ దాదాపు సీక్రెట్ గానే ఉంటాయి. మోదీ నోట నుంచి బయటకు వచ్చేదాకా వాటి గురించి మరెవరికీ తెలియని విధంగా వ్యవహారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు మోదీ తన ప్రసంగాన్ని మొదలుపెట్టేదాకా ఆయన చెప్పబోయే విషయం ఏమిటన్నది మాత్రం ఊహించడం కష్టమేనని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates