రైతుకు కష్టమొస్తే పవన్ తట్టుకోలేరబ్బా!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా అత్యంత సున్నిత మనస్కుడు. సమాజంలో ఏ వర్గానికి కష్టం వచ్చినా ఆయన దానిని పరిష్కరించేందుకు తరించిపోతారు. ఇక యావత్తు ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతలకు కష్టం వచ్చిందంటే మాత్రం ఆయన మరింతగా చలించిపోతారు. ఇప్పుడదే జరిగింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా దాదాపుగా అన్ని ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకూ తీవ్ర నష్టం జరిగింది. ఏపీలోని కోనసీమలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

ఈ సందర్బంగా అక్కడి పరిస్థితిని కళ్లకు కడుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిన పవన్… దసరా పర్వదినాలు పూర్తి కాగానే తానే ఆయా శాఖల అధికారులను వెంటబెట్టుకుని మరీ వస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జరిగిన నష్టాన్ని అంచనా వేసి రైతులను వీలయినంత మేర ఆదుకుంటామని కూడా పవన్ అన్నదాతలకు భరోసా ఇచ్చారు. కోనసీమలోని శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ నుంచి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటల్లోకి సముద్రపు నీరు చేరడం కారణంగా కొబ్బరి చెట్లు తలలు వాల్చేశాయని, ఇలా వేలాది ఎకరాలు దెబ్బతిన్న విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.

సముద్రపు పోటు సమయంలో ఉప్పు నీరు వైనతేయ పాయ నుంచి శంకరగుప్తం డ్రెయిన్ లోకి చేరి అక్కడి నుంచి కొబ్బరి తోటల్లోకి చేరుతోందని.. ఫలితంగా అక్కడి13 గ్రామాల పరిధిలోని కొబ్బరి తోటలకు నష్టం కలుగుతోందని ఆయన వివరించారు. ఫలితంగా ఈ గ్రామాల కొబ్బరి రైతులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారన్నారు. దసరా తర్వాత జరిగే తన పర్యటనలో తనతో పాటు నీటిపారుదల, వ్యవసాయం, కొబ్బరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కూడా అక్కడికి వస్తుందని, సమస్యను అక్కడిక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. మొత్తంగా పవన్ పుణ్యమా అని కోనసీమ కొబ్బరి రైతుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి.