వైసీపీ అధినేత జగన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉండి.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న ముగ్గురు అభ్యర్థులపై వేటు వేయించాలని ఆయన.. మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణను ఆదేశించినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని సోమవారమే మండలిలో ప్రవేశ పెట్టాలని.. వేటు వేయించే వరకు వదిలి పెట్టవద్దని కూడా తేల్చి చెప్పినట్టు తాడేపల్లి వర్గాలు తెలిపాయి. నిజానికి వైసీపీ తరఫున మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు.. టీడీపీలో చేరుతున్నారని వార్తలు వచ్చిన వెంటనే జగన్ అలెర్ట్ అయినట్టు తెలిసింది.
వారు ఇంకా పార్టీ మారకుండానే.. “ఏం చేద్దాం” అంటూ పార్టీ సీనియర్ నాయకులతో జగన్ చర్చించారు. అనంతరం.. రెండు మూడు గంటల్లోనే వారు పార్టీ మారి.. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకొన్నారు. దీంతో ఇక, ఉపేక్షించేది లేదని.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే.. దీనిని అనుకూలంగా మార్చుకోవాలని జగన్ పార్టీ నాయకులకుముఖ్యంగా బొత్స సత్యనారాయణకు తేల్చి చెప్పారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఉండి.. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయించాలని ఆయన సూచించారు. దీనిపై సోమవారమే చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో ఒక్కసారిగా మండలి రాజకీయం వేడెక్కింది.
ఏం జరిగింది?
వైసీపీ తరఫున గతంలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారు ఎంపికైన వారిలో మర్రి రాజశేఖర్(చిలకలూరిపేట), బల్లి కల్యాణచక్రవర్తి (గూడూరు), కర్రి పద్మశ్రీ(తూర్పుగోదావరి)లు.. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన దరిమిలా.. ఆ పార్టీకి రాజీనామాలు చేశారు. వైసీపీపై విమర్శలు చేస్తూ బయటకు వచ్చారు. ఆ తర్వాత కాలంలో తమ ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా సమర్పించారు. అయితే.. అప్పటి నుంచి వారి రాజీనామాలు ఆమోదం పొందలేదు. ఇక, ఎన్నాళ్లు వేచి చూసినా వారి రాజీనామాలు ఆమోదం పొందకపోవడంతో తాజా వారు సైకిల్ ఎక్కారు. నిజానికి ఐదుగురు రాజీనామా చేశారు. వీరిలో పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ కూడా ఉన్నారు. అయితే.. ఆమె ఇటీవల బీజేపీలో చేరారు. ఆమె రాజీనామా కూడా ఆమోదం పొందలేదు.
వేటు పడుతుందా?
ఇక, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చెబుతున్నట్టు వైసీపీ ఎమ్మెల్సీలపై వేటు పడుతుందా? అంటే కష్టమనే వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. వారు తమ తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలు మారారు. కానీ, మండలి చైర్మన్‌గా ఉన్న మోషేన్‌రాజు(వైసీపీ నాయకుడు) ఆయా రాజీనామాలను ఆమోదించలేదు. సో.. తప్పు మండలి చైర్మన్ దగ్గరే ఉంది. దీనిని బట్టి.. రేపు అనర్హత తీర్మానం ప్రవేశ పెట్టినా.. ఎప్పుడో రాజీనామాలు చేశారు కాబట్టి.. ఈ తీర్మానానికి ప్రాధాన్యం ఉండదు. అంతేకాదు.. ప్రస్తుతం జయమంగళ వెంకట రమణ రాజీనామా వ్యవహారం హైకోర్టులో పెండింగులో ఉంది. ఈ క్రమంలో జగన్ ప్రయత్నం వృథా అవుతుందన్న వాదన వినిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates