ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వానికి ఉల్లి రైతుల ఉసురు తగులుతుందని ఆమె చెప్పుకొచ్చారు. ఉల్లి రైతులను నిండా ముంచేశారని, కూటమి ప్రభుత్వానికి ఉల్లి రైతుల ఉసురు తగలకపోద ని షర్మిల అన్నారు. రైతుల కంట కన్నీళ్ళు పెట్టించిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబుదేనన్నారు. ఉల్లి ఎండినా నష్టమే..ఇప్పుడు పండినా నష్టమే అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి ఉందని షర్మిల వ్యాఖ్యానించారు. ఎకరాకు రూ.1.20 లక్షల పెట్టుబడి పోసి పండిస్తే.. ప్రభుత్వం ఇచ్చే ధర కిలోకి 50 పైసలా ? క్వింటాకు 50 రూపాయలా ? అని షర్మిల ప్రశ్నించారు.
ఆరుగాలం కష్టించి ఉల్లి పండిస్తే రైతుకి దక్కిన ఆదాయం ఎకరాకు రూ.3 వేలు మాత్రమేనని చెప్పారు. ఉల్లి పంట వేసిన కారణంగా ఒక్కో రైతుకి వచ్చిన నష్టం ఎకరాకు అక్షరాల రూ.లక్షా 15 వేలని షర్మిల చెప్పారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటారని, అలాంటి ఉల్లి పండించే రైతే ఉరేసుకొనే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉల్లి రైతులను అప్పుల పాలు చేయడమా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే అని ప్రశ్నించారు. ఉల్లి రైతు కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్రం సుభిక్షంగా ఎలా ఉంటుందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి రైతులు పడుతున్న కష్టాలు ప్రభుత్వం పట్టించుకుని పరిష్కరించాలని కోరిన షర్మిల.. ధర లేక బేజారు అవుతుంటే ఉల్లి రైతు కళ్ళల్లో ఆనందం ఎక్కడుంటుందన్నారు. కర్నూల్ మార్కెట్ లో దళారుల ధరతో సంబంధం లేకుండా క్వింటాకు రూ.1200 ఇస్తామన్నారని, కానీ.. ఇప్పటి వరకు రూపాయి కూడా విడుదల చేయలేదని షర్మిల వ్యాఖ్యానించారు. ఒక్క రైతుకైనా రూ.1200 గిట్టుబాటు ధర ఇచ్చారా ? అని నిలదీశారు. ఒక్క కిలో అయినా మార్క్ ఫెడ్ సేకరించిందా అని ప్రశ్నించారు. 50 పైసలకు అమ్ముకోలేక మార్కెట్ లోనే ఉల్లిని వదిలేస్తుంటే, కూలి ఖర్చులు కూడా రాలేదని బోరున విలపిస్తుంటే ఎక్కడుంది రైతు కళ్ళల్లో ఆనందం? అని నిలదీశారు.
రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ ధర వెయ్యికి పెంచేందుకు(పవన్ కల్యాణ్ మూవీ ఓజీ ధరలు పెంచడంపై) పెట్టిన శ్రద్ధ.. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంపై లేకపోవడం బాధాకరమని షర్మిల వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని, ఉల్లి ధరాఘాతంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని షర్మిల కోరారు. అసెంబ్లీలో ఉల్లి రైతుల కష్టాల మీద చర్చ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. మార్క్ ఫెడ్ ద్వారా ఇస్తామని చెప్పిన రూ.1200 వెంటనే అందేలా చూడాలన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates