ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మరోసారి కోపం వచ్చింది. గురువారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలి ప్రాధాన్య అంశంగా ప్రశ్నోత్తరాలు సమయానికి సమయం కేటాయిస్తారు. ఇది నిబంధనల ప్రకారం జరిగే కార్యక్రమం. ఈ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సభ్యులు ఏ ప్రశ్నలు అడిగారు.. మంత్రులు ఎలాంటి సమాధానం చెప్పారు.. అనే విషయాలను అసెంబ్లీ అధికారులు నమోదు చేసుకోవాలి. వాటిని రికార్డు చేయాలి.
ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ విషయంలో అసెంబ్లీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో మంత్రులు కూడా సభ్యులు అడుగుతున్న ప్రశ్నల పై కాకుండా వేరే అంశాలపై తమ పక్కన కూర్చున్న సభ్యులతో చర్చించడం పట్ల కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఇట్లాంటివి జరుగుతుండటం దురదృష్టకరమని, ఇకనుంచి ఇలాంటివి ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదన్నారు. అవసరమైతే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు.
మంత్రులకు కూడా సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. మంత్రులుగా ఉన్నవారు బాధ్యతగా ఉండాలని సభ్యులు అడుగుతున్న ప్రశ్నల పట్ల అవగాహన లేకపోతే సమాధానం ఏం చెబుతారని ఆయన విమర్శించారు. అదే సమయంలో మంత్రులు సదరు ప్రశ్నలకు సమాధానం చెప్పి ఊరుకోడమే కాదని, తర్వాత జరుగుతున్న అంశాలను మరుసటి రోజు సభలో చెప్పాలని కూడా ఆయన సూచించడం విశేషం. ఇక గత సభలో కూడా అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేల వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొందరు ఎమ్మెల్యేలు సభకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారని కనీసం వారు సమాచారం కూడా సభకు ఇవ్వడం లేదని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మొహం కూడా చూపించకుండా వెళ్ళిపోతుండడం ఏంటని గత సభలో ఆయన ప్రశ్నించారు. ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదన్నారు. చిత్రం ఏంటంటే ఇలా సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలలో కేవలం వైసీపీ మాత్రమే కాదు టిడిపి, బిజెపి సభ్యులు కూడా ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ చెప్పడం విశేషం.
ఇప్పుడు మరోసారి అధికారులు మంత్రులవైఖరిపై అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు రాకుండా అటు సభ్యులు ఇటు మంత్రులు అధికారులు కూడా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. సభను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్న ప్రజలు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను సీరియస్గా భావించడంతోపాటు సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారంలోకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates