అమరావతిలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సదస్సుకు దాదాపు రూ.10 కోట్ల వరకు ఖర్చయినట్టు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్లకు బస, భోజనాలు, వాహనాల ఖర్చు, రాకపోకల చార్జీలు, అల వెన్సులు, వారి దిగువస్థాయి అధికారులు, డ్రైవర్లకు కూడా సేమ్ టు సేమ్ ఖర్చులు.. వెరసి.. 10 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే.. ఇంత ఖర్చు చేసినా.. సీఎం చంద్రబాబు లక్ష్యాలు నెరవేరుతాయా? అనేది ప్రశ్న.
ఎందుకంటే.. సీఎం చంద్రబాబు ఈ కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో.. కీలకమైన 10 అంశాలను వారికి లక్ష్యాలుగా నిర్దేశించారు. రాష్ట్రంలో వృద్ధి సాధనతోపాటు.. డిజిటలీకరణ, మహిళా సాధికారత, శాంతి భద్రతలు, పీ-4, పెట్టుబడులు.. ఉద్యోగాలు, ఉపాధి కల్పన, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త, టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ ఆఫీసులపై సోలార్ ప్యానళ్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఇలా.. అనేక విషయాలపై చంద్రబాబు కలెక్టర్లు, ఎస్పీలకు లక్ష్యాలు నిర్దేశించారు. మంచిదే.. ఒక ప్రభుత్వం లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించడాన్ని అందరూ స్వాగతించాల్సిందే.
అయితే.. ఇది ఏకపక్షంగా సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఈ లక్ష్యాల సాధన మొత్తాన్నీ కూడా కలెక్టర్లు, ఎస్పీల భుజాలపైనే చంద్రబాబు మోపేశారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి రివ్యూ చేస్తానని కూడా చెప్పారు. అయితే.. వాస్తవానికి కలెక్టర్లు కానీ, ఎస్పీలు కానీ.. జిల్లాల స్థాయిలో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు అవకాశం ఉందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే .. అడుగడుగునా పెరిగిపోయిన.. రాజకీయ జోక్యం, నేతల ఉత్సాహం.. ఆధిపత్య ధోరణి వంటివి పారదర్శకంగా పనిచేసుకునే అధికారులకు కూడా తలనొప్పులు తెస్తున్నాయన్నది వాస్తవం.
ఈ విషయాన్ని కనీసం ప్రస్తావన కూడా చేయకుండానే సీఎం చంద్రబాబు.. లక్ష్యాలు పెట్టారని, మెజారిటీ కలెక్టర్లు.. వాపోయారు. పైకి వారు అనకపోయినా.. లంచ్ బ్రేక్, టీ బ్రేక్లలో కలెక్టర్లు చేసుకున్న చర్చల్లో ఇదే విషయం ప్రధానంగా వినిపించింది. ఫ్రీహ్యాండ్ లేనప్పుడు.. తాము మాత్రం ఏం చేస్తామని ఇద్దరు కలెక్టర్లు.. మీడియాతో సైతం వ్యాఖ్యానించారు. అంటే.. పైకి చెబుతున్నట్టుగా .. క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదన్నది వారు చెబుతున్నమాట. ఇది ముమ్మాటికీ వాస్తవం. సీఎం అండర్లో కంటే కూడా.. క్షేత్రస్థాయి ఎమ్మెల్యే ఎంపీ అండర్లోకి వెళ్లిపోయిన కలెక్టర్లు చాలా మంది ఉన్నారు. ఈ వ్యవస్థను సరిచేయకుండా.. ఎన్ని లక్ష్యాలు పెట్టినా.. కేవలం కంఠశోష తప్ప.. ఏమీ మిగలదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates