ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు.. ఏమ‌న్నారంటే!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను సీఎం చంద్ర‌బాబు ప్ర‌శంసించడం కొత్త‌కాదు. ప‌లుసంద‌ర్భాల్లో జ‌రిగిన కార్య‌క్ర మాలు.. స‌భ‌ల్లో ప‌ర‌స్ప‌రం ప్ర‌శంసించుకోవ‌డం అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజాగా రెండో రోజు క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సు లో సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని శాఖ‌ల‌పై స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న కృషిని, ఆయ‌న నిబ‌ద్ధ‌త‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర, అటవీ, మున్సిపల్, పంచాయితీరాజ్ తదితర శాఖలపై సీఎం సమీక్ష చేశారు. ఇవ‌న్నీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిధిలో ఉన్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఒక‌వైపు రాజ‌కీయాల‌ను.. అదేవిధంగా సినిమాల ను కూడా స‌మానంగా ముందుకు తీసుకువెళ్తున్నార‌ని.. ఇక‌, మ‌రోవైపు.. త‌న శాఖ‌ల విష‌యంలోనూ ఆయ‌న ప‌క్కా నిబద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, గిరిజ‌న ప్రాంతాల్లో ప‌వ‌న్ త‌న‌దైన ముద్ర వేశార‌ని చెప్పారు. పంచాయ‌తీల్లో ర‌హ‌దారుల నిర్మాణంతోపాటు.. గిరిజ‌నుల ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయాల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పోరేషన్ ద్వారా నిధులు కేటాయించామ‌ని బాబు తెలిపారు.

`స్వచ్ఛభారత్` కోసం ఏ జిల్లాలో అయినా పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు చేపడితే అది రాష్ట్రమంతా వర్తింప చేస్తామ‌ని చెప్పారు. ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు మన సంస్కతీ సంప్రదాయం, ఆ వృక్షాలు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపోందించమ‌ని తెలిపారు. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. చేతివృత్తులు, కులవృత్తులు దెబ్బతినకుండా కాపాడాల‌న్నారు.  

ఏజెన్సీ ప్రాంతాల్లో అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయితీలుగా తీర్చిదిద్దాల‌ని.. ఈ విష‌యంలో ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ దూరదృష్టితో ప‌నులు చేస్తున్నార‌ని తెలిపారు. రూరల్ ఏరియా అర్బన్ సౌకర్యాలతో ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నార‌ని చెప్పారు. స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ ను ఓ ఉద్యమంగా రాష్ట్రంలో చేస్తున్నామ‌న్న ఆయ‌న‌.. సింగపూర్ విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టామ‌ని గ‌తాన్ని వివ‌రించారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్నా డ్రెయిన్లు సరిగ్గా లేవన్న ఆయ‌న‌.. మేజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అట‌వీ సంప‌ద‌ను మ‌రింత వృద్ధి చేయాల‌ని ప‌వ‌న్‌కు కూడా సూచించారు.