జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అంత ఈజీగా నవ్వరు. ఏదైనా పెద్ద సందర్భం వస్తే తప్ప.. ఆయన పెద్దగా స్పందించరు. ప్రజల సమస్యలపైనా.. వాటి పరిష్కారంపైనా మాత్రమే దృష్టిపెడతారు. ఇక, ఏదైనా కార్య క్రమంలో పాల్గొన్నా.. కూడా ఆయన మౌనంగానే ఉంటారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన నిర్దిష్ట అంశాలపై మాట్లాడి వెళ్లిపోతారు. తాజాగా అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెండో రోజు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వాస్తవానికి తొలి రోజే ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ, ఇతర కార్యక్రమాలతో ఆయన హాజరు కాలేకపోయారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఉన్న అటవీ, పంచాయతీరాజ్, శాస్త్రసాంకేతిక శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు రెండో రోజు సమయం కేటాయించారు. రెండో రోజు పవన్ కల్యాణ్ ఈ సదస్సుకు హాజరయ్యారు. అయితే.. సమావేశంలో తొలి అర్ధబాగం ఆయన సీరియస్‌గానే ఉన్నారు. సీఎం చంద్రబాబు చెబుతున్న విషయాలు.. వాటిపై కలెక్టర్లు ఇచ్చిన వివరణలను కూడా ఆయన ఆసక్తిగా పరిశీలించారు. కానీ, అనూహ్యంగా పంచాయతీ రాజ్ విషయాన్ని చర్చించే సమయంలో పవన్ చిరునవ్వులు చిందించారు.
తానే కాదు.. తన పార్టీ నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్‌కు ల్యాప్‌టాప్‌లో పంచాయతీ రాజ్ ప్రగతిని చూపి స్తూ.. ఆయన చిరునవ్వులు చిందించారు. వైసీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఇలా ఉండేవని.. ఇప్పుడు ఇలా మారాయని.. సీఎం చంద్రబాబు స్వయంగా చెప్పిన సమయంలో తన ల్యాప్‌టాప్‌లో ఆయా అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రగతిని చిత్రాల రూపంలో చూస్తూ.. తన తోటి మంత్రి నాదెండ్లకు కూడా చూపిస్తూ.. పవన్ కల్యాణ్ నవ్వులు విరబూశారు. అంతేకాదు.. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పవన్ కల్యాణ్‌కు బ్రహ్మరథం పడుతున్నారని సీఎం చంద్రబాబు చెప్పినప్పుడు మరింత మురిసిపోయారు. ఈ చిరునవ్వుల భావం ఇదే!
Gulte Telugu Telugu Political and Movie News Updates