వైసీపీ అధినేత జగన్ సహా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్నారని.. ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయకుండా వారి తరఫున గళం వినిపించకుండా.. వారి సొమ్మును జీతంగా పొందే అర్హత ఎవరికీ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆదర్శంగా ఉండాలని సూచించారు. అసెంబ్లీకి కనీసం 50 రోజులైనా హాజరు కావాలని అన్నారు. సభకు హాజరుకాకుండా మీడియా మీటింగులు పెట్టడం సరికాదన్నారు.
తిరుపతిలో రెండు రోజులు పాటు జరగనున్న మహిళా ప్రజాప్రతినిధుల సాధికారత కమిటీల జాతీయ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాల్గొన్నారు. ఈ సందర్భంగానే జగన్‌పై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. సభకు రాకుండా జీతం తీసుకోవడం సరికాదన్నారు. ప్రజలు ఎన్నోఆశలు పెట్టుకుని.. ఎంతో మందిని ఓడించి.. మనల్ని గెలిపించారంటే.. వారికి మనపై ఎంతో విశ్వాసం ఉంటుందన్నారు. అలాంటి విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు.. ప్రజల సమస్యలపై ప్రశ్నించేందుకు సభను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
అంతేకాదు.. దేశంలోని అనేక ప్రైవేటు కంపెనీల్లో చిరుద్యోగులకు సైతం పనిచేయకపోతే.. వేతనం చెల్లించరని అన్నారు. అసెంబ్లీకి రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా సభలో ఉన్న స్పీకర్ ఓం బిర్లాకు విన్నవించారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులని, వాటికి కూడా రాకపోతే ఎలా? అని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఇక, మహిళలకు మేలు చేసేందుకు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారని, వారికి ఆస్తిలో హక్కును కల్పించారని అన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేశారని చెప్పారు. డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటు చేశారని తెలిపారు. ఎంఎస్ ఎంఈల ద్వారా మహిళలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మంత్రివర్గంలోనూ మహిళలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల నాటికి చట్టసభల్లో మరింత మంది మహిళలకు ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కూడా దక్కుతుందని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates