పార్టీలు వేరైనా.. చంద్రబాబుకు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గమనే కా కుండా.. బాబు విజన్ నచ్చిన వాళ్లు.. ఆయన దూరదృష్టి.. సంయమనం, ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో.. తెలిసిన విధానం.. ఆచితూచి వేసే అడుగులు వంటివి రాజకీయంగా చంద్రబాబును హైలెట్ చేస్తాయి. అప్పటికి .. ఇప్పటికి.. బాబు విజన్‌ను కొట్టిన వారు లేరు. ఈ క్రమంలోనే పార్టీలకు అతీతంగా కూడా బాబు ను అభిమానించేవారు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు ఉన్నారు. వీరిలో నిన్న మొన్నటి వరకు బీజేపీలోనే ఎక్కువగా ఉండేవారు.
కంభంపాటి హరిబాబు, కన్నా లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు, లంకా దినకర్, విష్ణుకుమార్ రాజు.. ఇలా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు గెలవాలని వీరంతా గత ఎన్నికల్లో కోరుకున్నారు. అయితే.. రాజకీయంగా .. పొత్తులు కుదరలేదు. అయినప్పటికీ.. బాబు గెలుపునే వీరంతా ఆకాంక్షించారు. ఇక, చంద్రబాబు ఓటమి తర్వాత.. వీరంతా.. ప్రభుత్వాన్ని భారీగా టార్గెట్ చేశారు. తమ దైన శైలిలో జగన్ సర్కారును ఇరుకున పెట్టారు. పైకి.. చంద్రబాబుతో వైరం ఉన్నట్టుగా వ్యవహరించినా.. లోపాయికారీగా మాత్రం పొత్తులు నడిపారు.
అయితే.. ఇప్పుడు సోము వీర్రాజు పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ వాతావరణం ఒక్కసారిగా మారిపో యింది. చంద్రబాబుపై మాటల దాడులు పెరుగుతున్నాయి. చిన్న చితకా నాయకులు కూడా బాబుపై విమర్శలు చేస్తున్నారు. అంతెందుకు .. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.. విష్ణువర్ధన్ రెడ్డికి చంద్రబాబు రాజకీయ అనుభవం అంత కూడా వయసులేదు. అయినా కూడా ఆయన బాబుపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక, బాబును పరోక్షంగా వెనుకేసుకు వచ్చినవారు.. మాత్రం మౌనం వహించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏం చేయాలి?
ఈ విషయంపైనే చంద్రబాబు అంతర్మథనం చెందుతున్నారు. తాజాగా.. పార్టీ నేతలకు ఆయన నుంచి ఆదేశం అందిందని అంటున్నారు.. దీనిని బట్టి.. బీజేపీలో తనను, పార్టీ ని విమర్శిస్తున్నవారిని అంతే దీటుగా తిప్పికొట్టాలని, విమర్శించాలని ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తానికి బాబు వర్గం తెరమరుగు కావడం.. విమర్శించేవారు పెరగడంతో ఇరు పార్టీల మధ్య రాజకీయవ్యూహాలు సైతం పెరుగుతున్నాయి.