జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణానికి హాజరయ్యేందుకు పవన్ ఈ పర్యటనకు వెళ్లారు. రాష్ట్రపతిలో ఈ వేడుక ముగిసిన అనంతరం ఆయన డిల్లీలో భావల్పూర్ ప్రాంతంలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంస్థలోని లైబ్రరీ, పుస్తక విక్రయశాలను సందర్శించారు. తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను ఆయన కొనుగోలు చేసి మరీ ఆయన అక్కడి నుంచి బయలుదేరారు.
వాస్తవానికి డిప్యూటీ సీఎం లాంటి నేతలు దేశ రాజధాని వెళితే… ఏ ప్రధాన మంత్రినో, కేంద్ర మంత్రులనో కలిసి తమ రాష్ట్రానికి కావాల్సిన పథకాలు, నిధులు తదితరాలపై చర్చిస్తూ సాగుతూ ఉంటారు. అయితే ఏపీలోని కూటమి సర్కారు వ్యవహార శైలి కారణంగా పవన్ కు ఆ అవసరమే లేకుండాపోయింది. ఢిల్లీలోని వ్యవహారాలన్నింటినీ మొన్నటిదాకా చంద్రబాబు చక్కబెడితే.. ఇప్పుడు మంత్రి నారా లోకేశ్ చక్రం తిప్పేస్తున్నారు. లోకేశ్ స్పీడు కారణంగా ఏపీకి అడగకున్నా కూడా నిధుల వరద పారుతోంది. వెరసి నిధులు, పథకాల గురించి కేంద్రంతో చర్చించాల్సిన అవసరం పవన్ కు పెద్దగా లేదనే చెప్పక తప్పదు.
ఇక మొదటి నుంచి కూడా పవన్ పుస్తక ప్రియుడే. దాదాపుగా 2 లక్షల పుస్తకాలను ఇప్పటికే చదివేశానని అప్పుడెప్పుడో చెప్పిన పవన్… అన్నేసి పుస్తకాలు చదివినా.. ఆయనకు ఇంకా పుస్తకాలపై తృష్ణ తీరలేదనే చెప్పాలి. తనకు తెలిసి ఎక్కడ పుస్తక పుస్తక ప్రదర్శన (బుక్ ఫెయిర్) లు జరిగినా పవన్ నేరుగా వాటిలోకి వెళ్లిపోయి… అలా గంటల సేపు అందులోని పుస్తకాలను తిరగేస్తూ సేదదీరుతారు. ఆ క్రమంలో తనను అమితంగా ఆకట్టుకున్న పుస్తకాలను ఆయన కొనుగోలు చేసి వాటిని తన చేతిలో భద్రంగా పట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. శుక్రవారం ఢిల్లీలోనూ అదే కనిపించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates