జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లిన పవన్… ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ఓ బాంబులాంటి సెటైర్ సంధించారు. ఆ సెటైర్ ఓ రేంజిలో పేలింది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ఏకంగా 164 సీట్లతో రికార్డు విక్టరీ దక్కించుకోగా… అప్పటిదాకా 151 సీట్లతో బలంగా కనిపించిన వైసీపీ మాత్రం 11 సీట్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకే భయపడిపోతున్నారు. ఏదో తమ సభ్యత్వాలు రద్దు కాకుండా ఉండేలా చూసుకుంటున్నారు తప్పించి అసెంబ్లీ సమావేశాల వైపే వెళ్లడం లేదు. జగన్ అనుసరిస్తున్న ఈ తరహా వ్యవహారంపై అధికార కూటమి పార్టీలు సెటైర్ల మీద సెటైర్లు పేలుస్తున్నాయి. అయినా జగన్ స్పందించడం లేదు.
ఈ క్రమంలో శుక్రవారం నాటి ఢిల్లీ పర్యటనలో జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై మీ స్పందనేమిటని మీడియా ప్రతినిధులు పవన్ ను కోరగా… “జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి రాకుండా ఉండేలా ఓ ప్రత్యేక రాజ్యాంగమైమైనా ఉందేమో?. వాళ్లు సొంత రాజ్యాంగం రాసుకున్నారేమో? అలాంటి రాజ్యాంగాలు భారత రాజ్యాంగం ముందు చెల్లవు కదా” అని ఆయన సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఒక్క కామెంట్ తో అక్కడున్న వారంతా నవ్వారు. పవన్ కూడా ముసిముసిగా నవ్వుతూ అలా కదిలిపోయారు. అయినా ఎన్నికల్లో జగన్ కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లను కూడా సాధించుకోలేకపోయారని కూడా పవన్ ఎద్దేవా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates