రాజకీయాల్లో పార్టీల అధిపతులు.. క్షేత్రస్థాయిలో నాయకులపై చాలానే నమ్మకాలు పెట్టుకుంటారు. దిగువ నుంచి సమాచారం .. ఎగువన ఉన్న పార్టీ అధిష్టానానికి అందించే ప్రధాన ఛానెల్ వీరే కనుక.. స్థానిక నేతల పై ఎక్కువగా ఆధారపడతారు. ఈ ప్రక్రియ సహజంగా అన్ని పార్టీల్లోనూ జరిగేదే. గతంలో టీడీపీ కూడా స్థానిక నేతలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. అయితే, అనూహ్యంగా వైసీపీలో ఈ విధానానికి సీఎం జగన్ ఫుల్ స్టాప్ పెట్టినట్టు కనిపిస్తోంది. స్థానికంగా ఉన్న నేతలను ఆయన విశ్వసించడం లేదని.. పార్టీలో చర్చ ప్రారంభమైంది.
గత కొన్నాళ్లుగా పార్టీలో విభేదాలు, వివాదాలు.. నేతలు ఎక్కడికక్కడ ఘర్షణలకు దిగడం వంటివి ఎక్కవగా కనిపిస్తున్నాయి. ఇలాంటివి వద్దని.. అందరూ కలిసి మెలిసి పనిచేయాలని జగన్ చెబుతున్నారు. కానీ, నాయకులు ఎక్కడా జగన్ మాటను పట్టించుకోవడం లేదు. దీంతో జగన్ కూడా వారిని పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. సరే! ఇదిలావుంటే.. తిరుపతి పార్లమెంటు స్థానానికి త్వరలోనే ఎన్నిక జరగనుంది. మరో రెండు మాసాల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో వైసీపీ ఇక్కడ ఎలాంటి అభ్యర్థిని ప్రకటిస్తుంది? అనే విషయం ఆసక్తిగా మారింది. మరీ ముఖ్యంగా పార్టీలో సీనియర్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వంటివారు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఎక్కడ అవకాశం ఉన్నా..తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి టికెట్ ఇప్పించుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారనే విషయం కొన్నాళ్లుగా స్థానిక మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి ఎవరికో హామీ కూడా ఇచ్చారని పార్టీలో చర్చ నడిచింది.
ఇక, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కూడా తనను సంప్రదించకుండా ఎవరికి మాత్రం టికెట్ ఇస్తారు? అనే ధీమాతో ఉన్నారు. కానీ, అనూహ్యంగా జగన్ ఎవరితోనూ మాట మాత్రం కూడా చెప్పకుండా.. తిరుపతి ఉప పోరుకు అభ్యర్థిని ఖరారు చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో వైసీపీ తరఫున దింపాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పాదయాత్ర సమయంలో డాక్టర్ గురుమూర్తికి-జగన్‌కు మధ్య సంబంధం బలపడింది. ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తు రెండేళ్లకు పైగా జగన్‌కు వైద్య సేవలు అందించారు. సరే!ఈ ఎపిసోడ్‌లో స్తానికంగా ఉన్న ఎవరినీ జగన్ నమ్మకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.